ఈడీ విచార‌ణ‌పై విజ‌య్ ఏమ‌న్నాడంటే..

లైగ‌ర్ సినిమా విడుద‌లై మూడు నెల‌లు దాటిపోయింది. కానీ దాని తాలూకు చేదు అనుభ‌వాలు మాత్రం చిత్ర బృందాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సినిమా వ‌ల్ల దారుణంగా న‌ష్ట‌పోయిన బ‌య్య‌ర్లు ప‌రిహారం కోసం పూరి జ‌గ‌న్నాథ్ ఆఫీసు ముందు ధ‌ర్నాకు సిద్ధం కావ‌డం.. వారికి పూరి గ‌ట్టిగా వార్నింగ్ ఇవ్వ‌డం.. దీని చుట్టూ న‌డిచిన వివాదం తెలిసిందే. ఆ వివాదం కాస్త స‌ద్దుమ‌ణిగేలోపే కొత్త త‌ల‌నొప్పి త‌ప్ప‌లేదు పూరి అండ్ కోకు.

‘లైగర్’ పెట్టుబడుల్లో బ్లాక్‌మనీ ఉందని.. కొందరు రాజకీయ నేతలు, బడా బాబులు ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేశారనే అనుమానంతం కొన్ని రోజులుగా ఈడీ అధికారులు ఈ టీంలో ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మిలను ఈడీ అధికారులు విచారించడం తెలిసిందే. తాజాగా లైగ‌ర్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఈడీ అధికారుల విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి వ‌చ్చింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల ప్రాంతంలో అత‌ను హైద‌రాబాద్‌ల ఈడీ ఈఫీసుకు వ‌చ్చాడు.

దాదాపు రాత్ర 8 గంట‌ల దాకా విచార‌ణ జ‌ర‌గ‌డం విశేషం. ఆ త‌ర్వాత బ‌య‌టికి వ‌చ్చిన విజ‌య్ కోసం మీడియాకు కాచుకుని ఉంది. అత‌డిపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. వీటికి బ‌దులిస్తూ.. సినిమాల వ‌ల్ల వ‌చ్చే పాపులారిటీ వ‌ల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయ‌ని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా త‌ప్ప‌వ‌ని.. అందులో భాగంగానే ఇలా ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వాల్సి వ‌చ్చింద‌న్న‌ట్లుగా మాట్లాడాడు విజ‌య్.

ఈడీ అధికారులు అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ తాను స‌మాధానం చెప్పాన‌ని అత‌ను వివ‌రించాడు. మ‌ళ్లీ విచార‌ణ‌కు రావాల‌ని అధికారులు కోరారా అని అడిగితే.. అలాంటిదేమీ లేద‌ని స్ప‌ష్టం చేశాడు విజ‌య్. ఎన్ని గంట‌ల పాటు విచార‌ణ జ‌రిగింద‌ని అడ‌గ్గా.. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి అంటే మీరే లెక్కేసుకోండి అనేసి అక్క‌డి నుంచి బ‌య‌ల్దేరాడు విజ‌య్.