అప్పుడు థమన్.. మరి ఇప్పుడు?

చాలా ఏళ్ల నుంచి తెలుగు సినిమా సంగీతంలో దేవిశ్రీ ప్రసాద్, తమన్‌లదే ఆధిపత్యం. వారి కంటే ముందు ఆధిపత్యం చలాయించిన కీరవాణి, మణిశర్మ ఇప్పటికీ కొనసాగుతున్నా.. వీరి స్థాయిలో వారు ఊపు చూపించడం లేదు. తెలుగులో ఏదైనా పెద్ద సినిమా తెరకెక్కబోతోందంటే వీళ్లిద్దరిలో ఒకరు సంగీత దర్శకుడిగా పిక్స్ అయిపోతున్నారు.

ఐతే తమన్ కంటే ముందు స్టార్ ఇమేజ్ సంపాదించిన దేవీ.. చాలా ఏళ్ల పాటు అతడిపై పైచేయి సాధించాడు. తొలి సినిమా నుంచే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్.. మంచి మంచి హిట్లు ఇస్తున్నా, పెద్ద సినిమాలు దక్కించుకుంటున్నా దేవి ముందు నిలవలేకపోయేవాడు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. తమన్ స్పష్టమైన పైచేయి సాధిస్తుండగా.. దేవి డౌన్ అయిపోతున్నాడు. ‘పుష్ప’ లాంటి ఒకటీ అరా చిత్రాలు మినహాయిస్తే దేవి ఒకప్పటిలా మెప్పించలేకపోతున్నాడన్నది వాస్తవం.

దేవి, తమన్ సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర తలపడినపుడు అందరిలోనూ ఆసక్తి నెలకొొంటోంది. చివరగా 2020 సంక్రాంతికి అలా జరిగింది. తమన్ ‘అల వైకుంఠపురములో’తో, దేవి ‘సరిలేరు నీకెవ్వరు’తో బాక్సాఫీస్ దగ్గర తలపడ్డారు. అప్పుడు తమన్‌దే తిరుగులేని పైచేయి అయింది. ‘అల..’కు తన కెరీర్లోనే అత్యుత్తమ ఆల్బంతో అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఒక ఊపు ఊపేశాడు తమన్.

అప్పుడు అతడికి త్రివిక్రమ్ నుంచి గొప్ప సపోర్ట్ లభించడం కూడా ఆ సినిమా సంగీతం అంత బాగా రావడానికి కారణం. అదే సమయంలో ‘సరిలేరు..’తో దేవి అంచనాలను అందుకోలేకపోయాడు. రొటీన్ పాటలతో నిరాశ పరిచాడు. కాగా ఇప్పుడు 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో దేవి, తమన్ మళ్లీ వార్‌కు రెడీ అయ్యారు. ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం. ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఇప్పటికే ‘బాస్ పార్టీ’ అనే పాట వచ్చింది.

టీజర్ చూసి ట్రోల్ చేసిన వారు అసలు పాటకు బాగానే కనెక్టయ్యారు. అలా అని ఆ పాట కేక అనలేం. ఇంతలో తమన్ ‘వీర సింహారెడ్డి’ నుంచి ‘రాజసం నీ పేరు’ అనే పాటతో పలకరించనున్నాడు. ఈ పాట.. ‘బాస్ పార్టీ’తో పోలిస్తే ఎలా ఉంటుందని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ‘అల..’కు త్రివిక్రమ్ లాంట ిమంచి మ్యూజిక్ టేస్టున్న త్రివిక్రమ్ అండ తమన్‌కు దక్కింది. కానీ ఈసారి అటు వైపు బాబీ.. ఇటువైపు గోపీచంద్ మలినేని లాంటి మాస్ డైరెక్టర్లే ఉన్నారు. ఆ రకంగా ఇద్దరి శక్తులు న్యూట్రల్ అయినట్లే. మరి ఈసారి దేవి, తమన్‌ల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.