బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న అత్యంత భారీ, మోస్ట్ యాంబిషియస్ ప్రాజెక్టుల్లో ప్రాజెక్ట్-కె ఒకటి. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ రూ.500 కోట్లకు పైగా బడ్జెట్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులకే రెండేళ్లు పట్టింది. షూటింగ్ కూడా చాలా శ్రమతో కూడుకున్నదే.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా భారీగానే ఉండబోతోంది. ఇది హాలీవుడ్ ఎవెంజర్స్ తరహా ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ టచ్ ఉన్న సినిమా. విజువల్ ఎఫెక్స్ట్ ప్రపంచ స్థాయిలోనే ఉండబోతున్నాయి. ఈ సినిమాతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తామని.. ఇది పాన్ వరల్డ్ సినిమా అని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా కోసం తాము పడుతున్న కష్టాన్ని వివరించాడు.
ప్రాజెక్ట్-కె సినిమా కొత్తదని.. అలాగే స్క్రిప్టు కూడా చాలా విభిన్నంగా ఉంటుందని, ఈ సినిమాకు అన్నీ సిద్ధం చేస్తున్న టెక్నీషియన్లు కూడా కొత్త వాళ్లే అని నాగ్ అశ్విన్ తెలిపాడు. ఒక రకంగా ఈ సినిమా ఎలా చేయాలి అనేది ఆలోచించడానికే చాలా సమయం పడుతోందని అతను చెప్పాడు. సినిమాకు సంబంధించి ఏదీ రెడీ మేడ్‌గా దొరకదని.. ప్రతిదీ సున్నా నుంచి రెడీ చేసుకుంటున్నామని నాగ్ అశ్విన్ వెల్లడించాడు.
మహానటి సినిమా కోసం వింటేజ్ కార్లు కావాలంటే ఎక్కడో ఓ చోట వెతికి రెంటుకు తెచ్చుకున్నామని.. కానీ ప్రాజెక్ట్-కె కోసం ఉపయోగిస్తున్న వాహనాలు ఏవీ కూడా ఎక్కడా దొరకవని.. వాటిని తామే అవసరమైన మేరకు తయారుచేయించుకున్నామని నాగి తెలిపాడు. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలనని.. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తుందని నాగ్ అశ్విన్ చెప్పాడు.