90వ దశకంలో తెలుగులో వరుసగా సినిమాలు చేసిన కన్నడ నటి ప్రేమ గుర్తుందా? ‘దేవి’ సినిమాలో దేవతగా మెప్పించిన ఆమె విక్టరీ వెంకటేష్ ‘ధర్మచక్రం’ సహా చాలా సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. ఐతే ఉన్నట్లుండి కథానాయికగా ఆమెకు ఆగిపోయాయి. ఆ తర్వాత ఆమె అక్క, వదిన లాంటి క్యారెక్టర్ రోల్స్‌కు మారిపోయింది.
ఐతే తనకు కథానాయికగా ఛాన్సులు తగ్గిపోయి, కెరీర్ దెబ్బ తినడానికి కారణం అప్పటి రచయిత, ఇప్పటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసే అంటోంది ప్రేమ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆరోపించడం గమనార్హం. ‘చిరునవ్వుతో’ సినిమాలో తనకు త్రివిక్రమ్ ఇచ్చిన పాత్రే కథానాయికగా తన కెరీర్ పాడవడానికి కారణమైందని ఆమె పేర్కొంది. తనకు ఈ పాత్ర గురించి చెప్పిన మాటలు వేరని, కానీ సినిమాలో చూస్తే ఆ పాత్ర ఇంకోలా ప్రెజెంట్ చేశారని ఆమె అంది.
‘చిరునవ్వుతో’ సినిమాకు కథ, మాటలు అందించింది త్రివిక్రమే. ఆ చిత్రంలో హీరో వేణుకు మరదలి పాత్రలో ప్రేమ నటించింది. హీరోను కాదనుకుని పెళ్లి పీటల మీది నుంచి వెళ్లిపోయిన ప్రేమ.. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ చేతిలో మోసపోయి తిరిగి ఇంటికి వస్తుంది. ఆమెకు వేణు అండగా నిలబడతాడు. ఈ సినిమాలో ఆమెది ఒక రకంగా చెప్పాలంటే ఏడుపుగొట్టు పాత్ర. ఐతే ఈ పాత్ర గురించి తనకు చెప్పినపుడు.. ఇందులో వేరే హీరోయిన్ ఉందా అని అడిగితే.. ‘‘లేదు, ఇందులో మీరే హీరోయిన్. కథ మొత్తం తన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కథలో కీలకం మీ పాత్రే’’ అని త్రివిక్రమ్ తనకు చెప్పాడని ప్రేమ వెల్లడించింది.
తీరా సినిమా చూస్తే తనది సహాయ పాత్ర అని, త్రివిక్రమ్‌ను నమ్మి ఆ సినిమా చేసినందుకు తన కెరీర్ దెబ్బ తిందని.. ‘చిరునవ్వుతో’ తర్వాత తనకు వరుసగా అలాంటి పాత్రలే వచ్చాయని, కథానాయికగా ఎదుగుతున్న దశలో తనకు ‘చిరునవ్వుతో’ సినిమాలో చేసిన క్యారెక్టర్ ప్రతికూలంగా మారిందని ఆమె అభిప్రాయపడింది.