గోపీచంద్ సినిమాలా ఉందేంటి విశ్వ‌క్?

ఈ మ‌ధ్యే సీనియ‌ర్ న‌టుడు అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా నుంచి బ‌య‌టికి వ‌చ్చేయ‌డం ద్వారా హాట్ టాపిక్ అయ్యాడు యంగ్ హీరో విశ్వ‌క్సేన్. ఆ వివాదం కాస్త స‌ద్దుమ‌ణిగాక త‌న కొత్త చిత్రంతో అత‌ను మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చాడు.

ఆ చిత్ర‌మే.. దాస్ కా ధ‌మ్కీ. ఇంత‌కుముందు ఫ‌ల‌క్‌నుమా దాస్ చిత్రంతో తొలిసారి మెగా ఫోన్ ప‌ట్టిన విశ్వ‌క్.. మ‌ళ్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ చిత్ర‌మిది. ముందు పాగ‌ల్ సినిమా ద‌ర్శ‌కుడు న‌రేష్‌ను ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా ఎంచుకున్న విశ్వ‌క్.. ఆ త‌ర్వాత త‌నే ఆ బాధ్య‌త తీసుకున్నాడు. సైలెంటుగా సినిమాను పూర్తి చేసిన విశ్వ‌క్.. అప్పుడే సినిమాను రిలీజ్‌కు రెడీ చేసేశాడు. తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ చేతుల మీదుగా దాస్ కా ధ‌మ్కీ ట్రైల‌ర్ కూడా లాంచ్ అయిపోయింది. ఫిబ్ర‌వ‌రిలో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాడు విశ్వ‌క్. పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్ కాబోతుండ‌డం విశేషం.

ఐతే ట్రైల‌ర్ చూసిన వాళ్లంద‌రికీ దాస్ కా ధ‌మ్కీ కొత్త క‌థ‌లా అనిపించ‌లేదు. కొన్ని పాత సినిమాల ఛాయ‌లు ఇందులో క‌నిపించాయి. ముఖ్యంగా గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది రూపొందించిన గౌత‌మ్ నంద సినిమాను చాలా వ‌ర‌కు దాస్ కా ధ‌మ్కీ పోలి ఉండ‌డం విశేషం. గౌత‌మ్ నంద‌లో హీరో డ‌బుల్ రోల్ చేశాడు.

ధ‌న‌వంతుడైన ఒక గోపీచంద్ డ‌బ్బు మీద విర‌క్తితో ఉండ‌గా.. డ‌బ్బు ఆశ‌తో అత‌డి స్థానంలోకి సామాన్యుడైన‌ మ‌రో గోపీచంద్ వెళ్తాడు. అక్క‌డ డ‌బ్బు రుచి మ‌రిగాక అత‌ను మారిపోతాడు. దాస్ కా ధ‌మ్కీలోనూ వెయిట‌ర్‌గా ప‌ని చేసే విశ్వ‌క్సేన్.. వేల కోట్ల‌కు అధిప‌తి అయిన ఇంకో విశ్వ‌క్సేన్ స్థానంలోకి వెళ్ల‌డం, అత‌డిలో మార్పు రావ‌డం ట్రైల‌ర్లో చూపించారు. మ‌రి విశ్వక్ ఒక ఫెయిల్యూర్ మూవీ స్ఫూర్తితో కొత్త‌గా ఏం చేశాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రం. గౌత‌మ్ నంద కాన్సెప్ట్ బాగున్నా.. ఎగ్జిక్యూష‌న్లో పొర‌బాట్ల‌తో దెబ్బ తింది. మ‌రి విశ్వ‌క్ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతినిస్తుందో చూడాలి.