రాజుగారు మంచి ఛాన్స్ మిస్ చేశారే

తన సినిమా ఎప్పుడు ఏ రోజు ఏ వారంలో రిలీజ్ చేయాలో పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకునే నిర్మాత దిల్ రాజు ఈసారి మాత్రం మంచి ఛాన్స్ మిస్ చేసినట్టే కనిపిస్తోంది. గత నెల విడుదలై తమిళంలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ టుడేని అదే పేరుతో తెలుగులో డబ్బింగ్ వెర్షన్ తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. నిన్న విజయ్ దేవరకొండతో ట్రైలర్ లాంచ్ చేయించారు. యూత్ కి పిచ్చ పిచ్చగా కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉండటంతో ఓపెనింగ్స్ గురించి దిల్ రాజు ధృడ నిశ్చయంతో ఉన్నారు. వాస్తవానికి దీనికి ముందు అనుకున్న విడుదల తేదీ నవంబర్ 18. ఓసారి ప్రకటన కూడా ఇచ్చారు.

ఈలోగా హారర్ థ్రిల్లర్ మసూదని తీసుకోవడం, దానికి ఈ డేట్ ఇచ్చి లవ్ టుడేని వాయిదా వేయాల్సి రావడం జరిగిపోయాయి. మధ్యలో కృష్ణ గారి మరణంతో ప్రమోషన్లు చేసే అవకాశం లేకుండా పోయింది. కట్ చేస్తే ఇవాళ శుక్రవారం బాక్సాఫీస్ చాలా డల్ గా కనిపిస్తోంది. మసూదకు ఎంత మంచి థియేటర్లు దక్కినా బుకింగ్స్ మరీ వీక్ గా ఉన్నాయి. చాలా బాగుందనే టాక్ వస్తే తప్ప సాయంత్రానికో రేపటికో పికప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే టార్గెట్ చేసుకున్న ఈ హారర్ థ్రిల్లర్ కు సహజంగానే ఫ్యామిలీ అండ్ క్లాస్ ఆడియన్స్ కొంత దూరంగా ఉంటారు.

అలాంటప్పుడు లవ్ టుడే కూడా ఈ రోజే వచ్చి ఉంటే మంచి ఓపెనింగ్స్ దక్కేవి. కాంతార తర్వాత థియేటర్ కు వెళ్లే సినిమాలు లేవు మహాప్రభో అంటూ గగ్గోలు పెడుతున్న కుర్రకారుకి ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మంచి ఆప్షన్ అయ్యేది. సుడిగాలి సుధీర్ గాలోడు ఇవాళే ఉంది కానీ దాని మీద బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత వారం వచ్చిన సమంత యశోద ఆల్రెడీ బాగా నెమ్మదించింది. ఇలా ఫ్రైడే డ్రైగా వెళ్ళిపోతే బయ్యర్లు ఇంకో వారం దాకా ఎదురు చూడాల్సి వస్తుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం లవ్ టుడే 25న అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంతో తలపడనుంది.