కృష్ణ.. అది కూడా చూసి వెళ్లుంటే..

ఒక సూపర్ స్టార్ కొడుకు సూపర్ స్టార్ కావడం అంత తేలికేమీ కాదు. టాప్ స్టార్ల కొడుకుల్లో తండ్రి స్థాయిని అందుకున్న వాళ్లు అరుదుగానే కనిపిస్తారు. ఆ అరుదైన జాబితాలో మహేష్ బాబు కూడా ఉన్నాడు. చిన్నతనంలో బాలనటుడిగా అదరగొట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న మహేష్.. పెద్దయ్యాక తక్కువ కాలంలోనే టాప్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు.

ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు లాంటి భారీ విజయాలతో తండ్రిని మించిన తనయుడు అని కూడా అనిపించుకున్నాడు. చిరంజీవి నంబర్ వన్ స్థానాన్ని ఖాళీ చేశాక ఆ స్థానానికి గట్టి పోటీదారుగా మారింది మహేషే. తర్వాత పాన్ ఇండియా సినిమాలు, హీరో ట్రెండ్ మొదలు కావడం వల్ల ఏ ఒక్కరినో నంబర్ వన్ అనలేని పరిస్థితి ఉంది. ఆ సంగతి పక్కన పెడితే మహేష్ ఎదుగుదల చూసి కృష్ణ కచ్చితంగా గర్వపడి ఉంటాడు. ఆయన కళ్ల ముందు మహేష్ తిరుగులేని స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. తండ్రి వారసత్వంగా ఇచ్చిన అభిమానులను మించి భారీగా కొత్త ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఐతే మహేష్ ఇప్పటిదాకా సాధించిందంతా ఒకెత్తయితే.. రాబోయే కొన్నేళ్లలో సాధించబోయేది మరో ఎత్తు అనే చెప్పాలి.

త్వరలోనే అతను రాజమౌళి సినిమాలో నటించబోతున్నాడు. ఆ చిత్రం పట్టాలెక్కడానికి ఇంకో ఏడాది సమయం పట్టొచ్చు. పూర్తి కావడానికి మరో రెండేళ్లు పట్టొచ్చు. ఈ సినిమా ఆషామాషీగా ఉండదని రాజమౌళి, ఆయన తండ్రి సంకేతాలు ఇస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో రాజమౌళి ఖ్యాతి ప్రపంచం నలమూలలా విస్తరిస్తోంది. మహేష్‌తో అంచనాలకు తగ్గ సినిమా తీస్తే ఆ సినిమా ఇండియాలోనే కాక ప్రపంచ స్థాయిలో సంచలనం రేపడం ఖాయం. అప్పుడు మహేష్ పాన్ వరల్డ్‌ బిగ్ స్టార్లలో ఒకడిగా అవతరిస్తాడనడంలో సందేహం లేదు. అది మహేష్ కెరీర్‌కు పతాక స్థాయి అనడంలో సందేహం లేదు. ఆ స్థాయిని కూడా చూసి ఉంటే కృష్ణ ఆనందానికి అవధులు ఉండేవి కావు. కానీ ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ దశలో ఉండగానే ఆయన కన్నుమూశారు.