సూప‌ర్ స్టార్‌కు జ‌గ‌న్ నివాళి

శ్వాస కోశ సంబంధిత సమస్యలతో తుదిశ్వాస విడిచిన సూప‌ర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి ఏపీ సీఎం జ‌గ‌న్ నివాళుల‌ర్పించారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామును 4 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచిన తెలుగు తెర వ‌జ్రాయుధం.. కృష్ణ భౌతిక కాయాన్ని హైదరాబాద్‌లోని పద్మాలయా స్టూడియోస్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లి నుంచి నేరుగా పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకుని.. సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఘట్టమనేని కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సంద‌ర్భంగా కృష్ణ కుమారుడు, యువ హీరో మ‌హేష్ బాబును సీఎం జ‌గ‌న్ ఆలింగ‌నం చేసుకుని ఓదార్చారు. అన్ని విధాలా కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కొద్ది సేపు మ‌హేష్ తో మాట్లాడి కృష్ణ అస్వ‌స్థ‌త‌కు సంబంధించిన విష‌యాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం.. సీఎం జ‌గ‌న్‌ను క‌లిసేందుకు వ‌చ్చిన వారిని మౌనంగానే ప‌ల‌కరించి.. అక్క‌డ నుంచి నిష్క్ర‌మించారు.

కాగా, మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున తుదిశ్వాస విడిచిన హీరో కృష్ణ‌కు బుధవారం తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు పద్మాలయా స్టూడియోలో ఆయన భౌతిక కాయన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాగా, త‌మ అగ్ర హీరో మృతి చెందార‌న్న వార్త‌తో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆయ‌న అభిమానులు తండోప‌తండాలుగా హైద‌రాబాద్‌కు చేరుకున్నారు.

ప‌త్రిక‌ల‌కు డిమాండ్‌.. మ‌ళ్లీ ముద్ర‌ణ‌

అభిమానుల రాక‌తో రైళ్లు, బ‌స్సులు కిక్కిరిసిపోయాయి. హైద‌రాబాద్ వీధులు జ‌న‌సంద్రాలు క‌నిపించాయి. ఎటు చూసినా.. కృష్ణ నామ‌స్మ‌ర‌ణ వినిపించింది. అదేస‌మ‌యంలో ప‌త్రిక‌ల కొనుగోళ్లు రికార్డు స్థాయికి చేరాయి. ఎప్పుడూ.. మ‌ధ్యాహ్నం.. 3గంట‌ల వ‌ర‌కు కూడా కిళ్లీ షాపుల్లో ద‌ర్శ‌న‌మిచ్చే ప‌త్రిక‌లు .. బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కే అయిపోయాయి. దీంతో కొన్ని ప‌త్రిక‌ల యాజ‌మాన్యాలు.. మ‌రోసారి ల‌క్ష కాపీల చొప్పున ముద్రించి బుధ‌వారం ఉద‌యం పంపిణీ చేయ‌డం గ‌మ‌నార్హం.