సూపర్ స్టార్.. మైండ్ బ్లోయింగ్ నంబర్స్

కొన్నేళ్ల ముందు ‘బాహుబలి’ సినిమాలో భారీతనం చూసి ఇండియన్ సినిమా స్క్రీన్ మీద ఇలాంటి సినిమానా అని అంతా ఆశ్చర్యపోయాం. కానీ అంతకు మూడు దశాబ్దాల ముందే అప్పటి భారతీయ సినిమా ప్రమాణాలను మించి ‘సింహాసనం’ అనే భారీ చిత్రాన్ని అప్పట్లోనే ఏకంగా కోటి రూపాయల బడ్జెట్ పెట్టి కళ్లు చెదిరే భారీతనంతో సినిమా తీసిన ఘనత కృష్ణకే చెందుతుంది. ఆ సినిమాకు హీరో మాత్రమే కాదు.. దర్శకుడు, నిర్మాత కూడా కృష్ణనే కావడం విశేషం. ఆ తరంలో అసలు సిసలైన సూపర్ స్టార్‌ అనిపించుకున్న కృష్ణ కెరీర్లో ఔరా అని నోరెళ్లబెట్టే ఘనతలు చాలా ఉన్నాయి. మచ్చుకు కొన్ని నంబర్లలో కృష్ణ గొప్పదనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  • కెరీర్ మొత్తంలో కృష్ణ 350కి పైగా సినిమాల్లో నటించారు. అందులో 330 సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. ఇండియాలో హీరోగా ఇన్ని సినిమాలు చేసిన నటుడు మరొకరు లేరు.
  • కేవలం ఆరు ఏళ్ల కాలంలో 110 సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించారు కృష్ణ. హీరోగా ఇంత తక్కువ వ్యవధిలో అన్ని సినిమాలు చేయడం ఒక రికార్డు.
  • 1972లో ఏకంగా 18 రిలీజ్‌లతో కృష్ణ సంచలనం రేపారు. ఒక ఏడాదిలో ఒక హీరో సినిమాలు ఇన్ని రిలీజ్ కావడం నభూతో, నభవిష్యతి అనదగ్గ రికార్డ్.
  • 1983లో ఒకే సిటీ (విజయవాడ)లో కృష్ణ నటించిన ఆరు చిత్రాలు శత దినోత్సవం జరుపుకున్నాయి. ఇలాంటి రికార్డు టాలీవుడ్లోనే కాదు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఎవరికీ లేదు.
  • ఈ రోజుల్లో ఒక దర్శకుడితో ఒక హీరో మూణ్నాలుగు సినిమాలు చేయడమే గగనంగా ఉంది. అలాంటిది కేఎస్ఆర్ దాస్ అనే సీనియర్ దర్శకుడితో కృష్ణ ఏకంగా 31 సినిమాలు చేశారు. కృష్ణ మొత్తం తన కెరీర్లో 31 మంది దర్శకులతో పని చేశారు.
  • కృష్ణ ఏకంగా 50 మల్టీస్లారర్ సినిమాలు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు.. ఇలా అందరు టాప్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
  • 1965 నుంచి 2009 వరకు 44 ఏళ్ల పాటు ఏ సంవత్సరమూ గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన ఏకైక హీరో కృష్ణ మాత్రమే. ఈ 44 ఏళ్లలో సంక్రాంతి రోజున రిలీజైన కృష్ణ సినిమాలు 30 ఉండడం విశేషం.
  • కృష్ణ స్వీయ దర్శకత్వంలో 16 సినిమాలు తెరకెక్కాయి. ఆయన చిత్రాలు 20 తమిళంలోకి అనువాదం కాగా.. 10 హిందీలోకి డబ్ అయ్యాయి. ‘మోసగాళ్లకు మోసగాడు’ ఇంగ్లిష్ సహా పలు విదేశీ భాషల్లోకి డబ్ అయింది.