మహేష్-త్రివిక్రమ్.. అసలేం జరుగుతోంది?

టాలీవుడ్లో ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ అయ్యే కాంబినేషన్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది ఒకటి. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అతడు’ ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. రెండో చిత్రం ‘ఖలేజా’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయినా ప్రేక్షకుల మనసుల్లో మాత్రం కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఆ సినిమా రిలీజైన పుష్కరం తర్వాత మళ్లీ ఈ కలయికలో సినిమా వస్తోందని అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు.

ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో కొంచెం ఆలస్యం జరిగింది కానీ.. ఎట్టకేలకు నెల కిందట చిత్రీకరణ మొదలవడంతో అందరూ హ్యాపీగా కనిపించారు. చెప్పినట్లే వచ్చే ఏడాది వేసవిలో సినిమా రిలీజవుతుందని అనుకున్నారు. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. తొలి షెడ్యూల్ తర్వాత షూటింగ్ ఆగింది. కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని.. మళ్లీ వర్క్ జరుగుతోందని.. మార్పులు చేర్పులు ఏవో జరుగుతున్నాయని. గుసగుసలు వినిపించాయి.

ఒక దశలో సినిమా ఆగిపోతుందనే ప్రచారం కూడా జరిగింది. ఐతే తాజా సమాచారం ప్రకారం కొన్ని మార్పులు చేర్పులతో సినిమాను ముందుకు తీసుకెళ్లడానికే నిర్ణయించుకున్నారట. ఇంతకుముందు అనుకున్నట్లు సినిమాలో యాక్షన్ డోస్ తగ్గిస్తున్నారని.. కథలో కూడా కీలక మార్పులు జరిగాయని అంటున్నారు.

కొందరేమో ముందు అనుకున్న కథను పూర్తిగా పక్కన పెట్టేశారని, కొత్త కథతో జర్నీ మొదలుపెట్టనున్నారని.. ఇంతకుముందు తొలి షెడ్యూల్లో తీసిన యాక్షన్ ఎపిసోడ్‌ను డస్ట్ బిన్‌లో పడేశారని కూడా అంటున్నారు. మరోవైపు ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు తమన్‌ను తప్పంచేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ తమన్‌తో త్రివిక్రమ్‌కు ఈ మధ్య బాగా సింక్ అవుతుండటం.. ఇద్దరి కలయికలో రెండు సూపర్ హిట్ ఆల్బమ్స్ రావడాన్ని దృష్టిలో ఉంచుకుని సంగీత దర్శకుడిని మార్చే అవకాలు అంతగా కనిపించడం లేదు. డిసెంబరు తొలి వారంలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.