అక్కినేని నాగార్జునకు ఈ మధ్య బాక్సాఫీస్ దగ్గర అస్సలు కలిసి రావడం లేదు. క్రమ క్రమంగా ఆయన బాక్సాఫీస్ మీద పూర్తిగా పట్టు కోల్పోతున్నారు. నాగ్ సినిమాలు బాగున్నాయని అన్నా థియేటర్లకు వచ్చి చూసే పరిస్థితి కనిపించడం లేదు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత ఆ స్థాయిలో నాగ్ సినిమా ఏదీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేదు.
గత ఏడాది ‘వైల్డ్ డాగ్’ అనే థ్రిల్లర్ మూవీ మంచి టాక్ తెచ్చుకుని కూడా దారుణమైన వసూళ్లు రాబట్టింది. ఫుల్ రన్లో రూ.4 కోట్ల లోపు షేర్ కలెక్ట్ చేసి డిజాస్టర్‌గా నిలిచింది. ఐతే ఈ సినిమా తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైతే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కొన్ని వారాల పాటు సినిమా టాప్‌లో ట్రెండ్ అయింది. వివిధ భాషల వాళ్లు ఆ సినిమాను గొప్పగా ఆదరించారు.
తన కొత్త చిత్రం ‘ది ఘోస్ట్’ ప్రమోషన్ల టైంలో నాగ్ ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. కొవిడ్ వల్ల ఆ సినిమా అంతగా ఆడలేదని.. తర్వాత నెట్ ఫ్లిక్స్‌లో గొప్ప రెస్పాన్స్ తెచ్చుకుందని అన్నారు. ‘ది ఘోస్ట్’ కచ్చితంగా థియేటర్లలో మంచి ఫలితం అందుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనిపించింది.
దసరా టైంలో వీకెండ్లోనే సరైన వసూళ్లు రాబట్టలేకపోయిన ‘ది ఘోస్ట్’ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. కానీ ఈ చిత్రం కూడా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లో రిలీజై అదిరే స్పందన తెచ్చుకుంటోంది. హిందీలో మొన్న సినిమా రిలీజైన దగ్గర్నుంచి నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుండగా.. తెలుగు వెర్షన్ నాలుగో స్థానంలో ఉంది. ఇది చూసి నాగ్ బాక్సాఫీస్ కింగ్ కాదు.. నెట్ ఫ్లిక్స్ కింగ్ అంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. మరి నాగ్ మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు ఇలాంటి స్పందన తెచ్చుకుంటాడో చూడాలి.