వారసుడు వెనుక ఏం జరుగుతోంది

varasudu
varasudu

మాములుగా విజయ్ సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో ఓ రేంజ్ కోలాహలం ఉంటుంది. అదీ పొంగల్ సీజన్ లో అజిత్ తో పోటీ ఉంటే ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు. వారం పది రోజులు థియేటర్ల వద్ద జాతరకు ఏ మాత్రం తీసిపోని వాతావరణం చూడొచ్చు.

వారసుడుకి సైతం ఇదే తరహా రచ్చని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. దీన్ని నిర్మిస్తున్న దిల్ రాజుకు ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు కానీ ఎటొచ్చి తెలుగు వెర్షన్ కు సంబంధించిన వ్యవహారాలను సెటిల్ చేయడమే పెద్ద తలనెప్పిగా మారనుందని ఇన్ సైడ్ టాక్. కారణం సంక్రాంతికి ఏర్పడనున్న విపరీతమైన పోటీ.

వరిసుకి అజిత్ తునివు ఒకటే మేజర్ కాంపిటీషన్. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిల గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు. కానీ హీరో విజయ్ వారసుడుకి తెలుగులోనూ బిగ్ రిలీజ్ ప్లాన్ చేయమని దిల్ రాజుకి సూచించాడట.

తుపాకీ నుంచి క్రమంగా తన మార్కెట్ బలపడుతూ వస్తోంది కాబట్టి బడా ప్రొడ్యూసర్ అయిన మీలాంటి వారితో అక్కడ స్థానం సుస్థిరపరుచుకోవచ్చని అన్నారట. అతనే అంతగా చెప్పాక నో అనడానికి ఏముంటుంది. కానీ ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం చిరంజీవి బాలకృష్ణలకే తమ మొదటి ఓటంటున్నారు. ఇది సహజం తప్పేం కాదు.

పైగా మైత్రి సంస్థ స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ని హైదరాబాద్ లో తెరిచిందనే వార్త నిజమో కాదో తెలియకుండానే ఇప్పటికే ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బయ్యర్లను తనవైపుకి తిప్పుకోవడం దిల్ రాజుకి అంత సులభం కాదు.

ఒకవేళ తన కంట్రోల్ లో ఉండే స్క్రీన్లలో వారసుడుకి ఎక్కువ కౌంట్ వచ్చేలా చేసుకున్నా నాలుగైదు థియేటర్లు మాత్రమే ఉండే అధిక శాతం బీసీ సెంటర్లలో ఇదో పెద్ద ఇష్యూ అవుతుంది. పైగా డబ్బింగ్ చిత్రం కాబట్టి తనకే అడ్వాన్సులు తక్కువగా వస్తాయి.అందుకే హైప్ కోసమే 280 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ వారసుడికి జరిగిందనే ప్రచారం చేస్తున్నారని మరో టాక్ కూడా ఉంది. మొత్తానికి తెరమీద కంటే బయట కథే ఆసక్తికరంగా ఉంది