ఫుల్ అడ్వాంటేజ్.. వాడుకునేదెవరో?

ఆగస్టులో రెండు వారాల వ్యవధిలో మూడు భారీ హిట్లతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చిన సినిమాలు లేవనే చెప్పాలి. దసరాకు ‘గాడ్ ఫాదర్’ తొలి వీకెండ్ వరకు సందడి చేసినా ఆ తర్వాత చల్లబడిపోయింది. అంతిమంగా చూసుకుంటే ‘గాడ్ ఫాదర్’ను హిట్టు సినిమా అని చెప్పలేం. దసరా తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ మరింత డల్లయింది.

డబ్బింగ్ సినిమాలు ‘కాంతార’, ‘సర్దార్’ మినహాయిస్తే తెలుగు చిత్రాలేవీ సత్తా చాటలేకపోతున్నాయి. బోలెడన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నా.. పోటీ పెద్దగా లేకపోయినా.. ఈ అడ్వాంటేజీని ఉపయోగించుకునే సినిమాలు రావట్లేదు. గత వారం పూర్తిగా టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయింది. మరి ఈ వారం అయినా పరిస్థితి మారుతుందేమో అని ట్రేడ్ ఎదురు చూస్తోంది. ఈ వారం ఏకంగా పది సినిమాల దాకా రిలీజవుతుండడం విశేషం.

ఐతే ఇందులో అనువాద చిత్రాలైన ఆకాశం, బెనారస్‌లతో పాటు బొమ్మ బ్లాక్‌బస్టర్ లాంటి ఒక అరడజను సినిమాలు అసలు తెలుగు ప్రేక్షకుల దృష్టిలోనే పడలేదు. ఇవన్నీ నామమాత్రపు రిలీజ్‌లనే చెప్పాలి. ఉన్నంతలో ఒక మూడు చిత్రాలు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అవే.. ఊర్వశివో రాక్షసివో, లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, తగ్గేదేలే.

ఇందులో ‘ఊర్వశివో రాక్షసివో’ రొమాంటిక్ ప్రోమోలతో యూత్‌లో ఆసక్తి రేకెత్తించింది. ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ మంచి కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. ‘తగ్గేదేలే’ను రూపొందించింది ‘దండుపాళ్యం’ దర్శకుడు శ్రీనివాసరాజు కావడం విశేషం. అది మాస్‌లో కొంత బజ్ తెచ్చుకుంది. ఐతే ఈ మూడు చిత్రాలకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఆశాజనకంగా లేవు. అన్నింటికీ టాక్ కీలకంగా మారింది. ఏ సినిమాకు టాక్ వస్తే దానికి వసూళ్లు బాగుంటాయి. ఐతే చాలా మంచి టాక్ వస్తే తప్ప థియేటర్లకు వచ్చే మూడ్‌లో లేని ప్రేక్షకులను ఏవి కదిలిస్తాయో చూడాలి.