చిరంజీవి ట్వీట్ వేసిండహో..

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి రావడం రావడం ఒక తుపానులా వచ్చారు. ఇప్పుడున్న యువ కథానాయకులెవ్వరిలోనూ లేనంత హుషారు చూపించారు. ట్విట్టర్లో వరుసబెట్టి పోస్టులు పెడుతూ.. కౌంటర్లు, సెటైర్లు వేస్తూ.. చాలా సరదాగా కనిపించారు. సరిగ్గా కరోనా ప్రభావం మొదలైన కొత్తలో ఆయన ట్విట్టర్లోకి రావడంతో ఆయనకు ఇది మంచి కాలక్షేపం అయింది. అభిమానులూ ఆయన ట్వీట్ల పట్ల చాలా ఉత్సాహం చూపించారు. నాలుగు నెలల్లోనే వందకు పైగా ట్వీట్లు వేసేశారు చిరు. ఐతే ఈ మధ్య ఉన్నట్లుండి ట్విట్టర్ నుంచి చిరు విరామం తీసుకోవడం, ఆయన్నుంచి కొత్త ట్వీట్లేవీ లేకపోవడం కూడా వార్త అయి కూర్చుంది. గత నెల ఆరంభం నుంచే జోరు తగ్గించిన చిరు.. చివరగా జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా ఒక ఎమోషనల్ ట్వీట్ వేసి సైలెంటైపోయారు.

అప్పట్నుంచి చిరు ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్టులేవీ లేకపోవడంతో అభిమానుల్లో నిరాశ వ్యక్తమైంది. చిరు ఉన్నట్లుండి ఎందుకు బ్రేక్ తీసుకున్నాడో జనాలకు అర్థం కాలేదు. దీని వెనుక కారణాలను విశ్లేషించే పనిలో పడిపోయారు. ఐతే 20 రోజుల విరామం తర్వాత, శనివారం చిరు మళ్లీ ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆయన ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి గురించి వేసిన ట్వీట్ మీద స్పందించారు. కేరళలోని కూనూర్‌కు చెందిన శివన్ అనే పోస్ట్ మ్యాన్ రోజూ 15 కిలోమీటర్లు అడవిలో ప్రమాదకర పరిస్థితుల్లో నడిచి వెళ్లి గ్రామాలకు ఉత్తరాలు ఇచ్చి వస్తుంటాడని.. ఎన్నో ఏళ్లుగా ఇలా చేస్తున్నాడని సుప్రియ సాహు అనే ఐఏఎస్ అధికారి ఇటీవల ట్వీట్ చేశారు. ఈ పోస్టు ఇంటర్నెట్లో వైరల్ అయింది. దీనిపై ఇప్పుడు చిరు స్పందించారు. కొందరు తమ వృత్తిని సమర్థంగా నిర్వహించడంలోనే అత్యంత తృప్తిని పొందుతారని.. ఇలాంటి వాళ్ల వల్లే మానవత్వం బతుకుతుందని చిరు ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ తర్వాత చిరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కొనసాగుతారా మళ్లీ బ్రేక్ తీసుకుంటారా అన్నది చూడాలి.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content