అభిమానులంటే ప్రాణం.. వాళ్లు లేకపోతే మేం లేము అని అందరు హీరోలు అంటారు. కానీ వారి మీద నిజంగా అందరికీ అంత అభిమానం ఉంటుందా.. వారి మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారా అన్నది సందేహమే. ఇటీవల ప్రభాస్ కృష్ణంరాజు దినం కార్యక్రమం సందర్భంగా లక్ష మందికి పైగానే అభిమానులకు మంచి నాన్ వెజ్ విందు పెట్టి ఫ్యాన్స్ తనకెంత ప్రత్యేకమో చాటుకున్నాడు.
ఇలా అభిమానుల మీద సందర్భాన్ని బట్టి తమ కృతజ్ఞతను చూపించే హీరోలు కొందరున్నారు. ఐతే అందరూ అభిమానుల కోసం డబ్బులు ఖర్చు పెట్టి వారి పట్ల తమ ప్రేమను చాటాల్సిన అవసరం లేదు. తమను చూడడానికి వచ్చినపుడు కాస్త వీలు చేసుకుని వాళ్లను కలవడం.. వారితో ఫొటోలు దిగడం చేస్తే కూడా వారి కడుపు నిండిపోతుంది.
బాలీవుడ్ లెజెండరీ హీరో అమితాబ్ బచ్చన్ ఎన్నో ఏళ్ల నుంచి ఇదే పని చేస్తున్నాడు. ముంబయిలోని తన నివాసం వద్ద వారానికి ఒక రోజు అమితాబ్ తన అభిమానులకు దర్శనం ఇస్తాడు. తన కోసం ఓపిగ్గా ఎదురు చూసే వారి కోసం సమయం కేటాయించి వారికి అభివాదం చేస్తాడు. వయసు, అనారోగ్య సమస్యల వల్ల ఫొటోలైతే దిగడు. ఐతే ఇలా అభిమానులను సందర్శించే సమయంలో అమితాబ్ చెప్పులు వేసుకోడన్న సంగతి ఆ సమయంలో ఆయన్ని గమనించిన వారికి తెలిసి ఉంటుంది. దీనికి కారణమేంటో అమితాబ్ తాజాగా వెల్లడించాడు.
అభిమానులంటే తనకు భక్తి అని, వారిని దేవళ్లలా చూస్తానని.. తనను ఇంత వాడిని చేసిన అభిమానులను కలిసేటపుడు వారి మీద తన భక్తిని చాటుకునేందుకే చెప్పులు వేసుకోకుండా వారి ముందు నిలబడతానని అమితాబ్ చెప్పడం విశేషం. ఫ్యాన్స్ విషయంలో ఇంత గౌరవభావం కలిగిన హీరో అమితాబ్ ఒక్కడే అయ్యుంటాడేమో. ఇందుకు ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.