కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. ప్రభాస్ కొత్త చిత్రం ఆదిపురుష్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావడం లేదని తాజా సమాచారం. కొన్ని రోజులుగా ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్న చిత్ర బృందం.. చివరికి సంక్రాంతి రేసు నుంచి తమ చిత్రాన్ని తప్పించడానికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లందరికీ విషయం చేరవేశారట.
ఈ మేరకు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో జోరుగా వార్తలొస్తున్నాయి. నెల ముందు వరకు ఆదిపురుష్ సినిమా విషయంలో చాలా ధీమాగా ఉంది చిత్ర బృందం. కానీ టీజర్ రిలీజయ్యాక పరిస్థితి మారిపోయింది. అది నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అందులో విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు రావణుడు, హనుమంతుడు పాత్రల లుక్స్, అప్పీయరెన్స్ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
దీంతో ఓం రౌత్ అండ్ టీం వీఎఫెక్స్, ఇతర విషయాల్లో మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొచ్చాయి. మరోవైపు సంక్రాంతికి తెలుగులో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి మాస్ మసాలా సినిమాలు విడుదల ఖరారు చేసుకున్నాయి. వాటికి తోడు విజయ్ డబ్బింగ్ మూవీ వారసుడు కూడా విడుదలవుతోంది.
వాటి కోసం చాలా థియేటర్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆదిపురుష్ లాంటి భారీ చిత్రాన్ని ఎక్కువ థియేటర్లలో సోలోగా రిలీజ్ చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. పోటీ లేకుంటేనే దీనికి మంచిది. సంక్రాంతికి తక్కువ థియేటర్లలో, ఇంత పోటీ మధ్య రిలీజ్ చేస్తే వసూళ్లపై తీవ్ర ప్రభావం తప్పదు.
ఈ నేపథ్యంలో సినిమాను కొంచెం లేటుగా సోలోగా రిలీజ్ చేయడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారని, ఈ లోపు సినిమాకు మెరుగులు దిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆదిపురుష్ వాయిదాపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.