శక్తి, షాడో లాంటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత మెహర్ రమేష్ చాలా ఏళ్ల పాటు ఖాళీగా ఉండిపోయాడు. అతడికి అవకాశం ఇవ్వడానికి నిర్మాతలు, హీరోలెవరికీ ధైర్యం చాల్లేదు. ఇక మెహర్ రమేష్ మళ్లీ మెగా ఫోన్ పట్టి ఓ సినిమా తీయడం కష్టమే అని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. అతను కూడా అలాంటి ప్రయత్నాలేమీ చేస్తున్నట్లు కనిపించలేదు.
కానీ కరోనా టైంలో తన పేరిట చేపట్టిన సహాయ కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకోవడమే కాక.. అనేక బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటి వాటిని కూడా కొన్నేళ్లుగా పర్యవేక్షిస్తున్న మెహర్‌కు తన వంతుగా ఏదైనా సాయం చేయాలని భావించి ‘వేదాళం’ రీమేక్ బాధ్యతను అతడికి అప్పగించాడు చిరు. రీమేక్ కాబట్టి మరీ కంగారు పడాల్సిన పని లేదని చిరు భావించి ఉండొచ్చు. దారుణమైన ట్రాక్ రికార్డున్న మెహర్‌కు అవకాశం ఇవ్వడాన్ని అభిమానులు వ్యతిరేకించినా చిరు పట్టించుకోలేదు.
ఐతే మెహర్ మాత్రం ‘భోళా శంకర్’ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అభిమానులు బాగా ఎంజాయ్ చేసే మాస్ ఎంటర్టైనర్ ఇదని మెహర్ ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘భోళా శంకర్’కు, తాను తీసిన హిట్ మూవీ ‘బిల్లా’కు అతను పోలిక పెట్టాడు. ‘బిల్లా’ ఒరిజినల్లో అజిత్ హీరోగా నటించాడని.. ‘భోళా శంకర్’ ఒరిజినల్ ‘వేదాళం’లోనూ అజితే హీరో అని మెహర్ చెప్పాడు.
‘బిల్లా’ సినిమా థీమ్ మాత్రమే తీసుకుని మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసినట్లే.. ‘వేదాళం’ సినిమాకు కూడా చేశామని మెహర్ తెలిపాడు. ఇప్పటికి 40 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. సినిమా చాలా బాగా వస్తోందని.. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అతను వెల్లడించాడు.చిరు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రాన్ని సీనియర్ నిర్మాత కేఎస్ రామారావుతో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.