ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి, సరైన టైమింగ్‌లో రిలీజ్ చేయడం కీలకంగా మారింది. సరైన టైమ్‌లో రిలీజ్ చేయడం వల్ల కొన్ని సినిమాలు అనుకున్న దాని కంటే మంచి ఫలితాలు అందుకుంటూ ఉంటాయి. అలాగే టైమింగ్ తేడా కొట్టి రిజల్ట్ కూడా అటు ఇటు అయ్యే సినిమాలు కూడా ఉంటాయి.
దసరాకి పెద్ద సినిమాలు బరిలో ఉన్నా పట్టించుకోకుండా ‘స్వాతిముత్యం’ అనే సినిమాను రిలీజ్ చేసి దెబ్బ తిన్నాడు నిర్మాత నాగవంశీ. ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకుని కూడా ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోయింది.
ఇంకో వారం ఆగి అక్టోబరు మధ్యలో సినిమాను రిలీజ్ చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో. ఖాళీగా ఉన్న ఆ వీకెండ్‌ను కన్నడ సినిమా ‘కాంతార’ బాగా ఉపయోగించుకుంది. సోలోగా వసూళ్ల పంట పండించుకుంది.
మళ్లీ దీపావళికి కూడా మ్యాడ్ రష్ చూశాం. ఒకేసారి ఐదు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. ఈ పోటీ వల్ల అన్నిటికీ నష్టం జరిగింది. ఉన్నంతలో ‘సర్దార్’, ‘బ్లాక్ ఆడమ్’ బాగా ఆడాయి. మిగతావి దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా మంచు విష్ణు సినిమా ‘జిన్నా’ అన్యాయం అయిపోవడానికి తీవ్రమైన పోటీనే కారణం.
ఓ వారం ఆగి ఇందులో రెండు సినిమాలను ఈ వారం రిలీజ్ చేసుకుని ఉంటే వాటికి ప్లస్ అయ్యేది. ఇక ప్రస్తుత వారాన్ని కూడా ఖాళీగా వదిలేశారు. చెప్పుకోదగ్గ సినిమా ఏదీ రిలీజ్ కావట్లేదు.
మళ్లీ వచ్చే వారానికి ఊర్వశివో రాక్షసివో, లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, బొమ్మ బ్లాక్‌బస్టర్.. ఇలా చాలా సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇలా ఒకే వారం ఎక్కువ సినిమాలు పోటీ పడడం ఏంటో.. ఇంకో వారాన్ని ఖాళీగా వదిలేయడమేంటో అర్థం కావడం లేదు. ఇది టాలీవుడ్ ప్లానింగ్ లోపాన్ని సూచిస్తోంది.