విజయ్ లక్ష్యంగా అజిత్ ప్లాన్

సంక్రాంతి వేడి టాలీవుడ్ లోనే కాదు అటు కోలీవుడ్ లోనూ సెగలు పుట్టిస్తోంది. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన వారిసు(వారసుడు)మీద అక్కడ ఎన్ని అంచనాలున్నాయో తెలిసిందే. నిర్మాత దిల్ రాజు క్రేజీ బిజినెస్ ఆఫర్స్ తో ఉక్కిరి బిక్కిరివుతున్నారు. తెలుగులో ఆడేదంతా బోనస్ కిందకే రానుంది. అంతగా విజయ్ మార్కెట్ భారీ లాభాలను ఇవ్వనుంది. దానికి తోడు వారసుడు ప్రాపర్ తమిళ్ మూవీ అని వంశీ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ కి మరింత ఉత్సాహం వచ్చేసింది. అందుకే ఇక్కడి వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి పోటీని సీరియస్ గా తీసుకోవడం లేదు.

ఎటొచ్చి ఆది పురుష్ తో కొంత ఇబ్బంది ఉండొచ్చేమో కానీ హీరోల మీద విపరీతమైన వర్షిప్ ఉండే తమిళ్నాట విజయ్ బొమ్మకే అగ్ర తాంబూలం ఇస్తారు మూవీ లవర్స్. ఇక్కడే అసలు కథ మొదలుకానుంది. అజిత్ హీరోగా వినోత్ డైరెక్షన్ లో రూపొందిన తునివు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని పొంగల్ కే రిలీజ్ చేయాలని నిర్మాత బోనీ కపూర్ గట్టి సంకల్పంతో ఉన్నారట. అంటే వారసుడుతో నేరుగా క్లాష్ జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మాములుగానే విజయ్ అజిత్ ఫ్యాన్ వార్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే

ఇక్కడే మరో ట్విస్టు ఉంది. తునివు(తెలుగు టైటిల్ ఫిక్స్ చేయలేదు)ని ఆరు నూరయినా సరే వారసుడు వచ్చే డేట్ కి వేయాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. థియేటర్ల అగ్రిమెంట్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఇంతకంటే మార్గం లేదని, ఒకవేళ ముందొచ్చినా ఆలస్యంగా వచ్చినా దాని వల్ల స్క్రీన్ కౌంట్ ప్రభావితం చెందే అవకాశం ఉంటుంది కనక సమానంగా పంపకాలు జరగాలంటే ఇంతకంటే మార్గం లేదని డిస్ట్రిబ్యూటర్లు సూచించడంతో దానికే సిద్ధపడ్డారని తెలిసింది. ఇక్కడేమో చిరు బాలయ్యల ఢీ వద్దని బయ్యర్లు మొత్తుకుంటే అక్కడ సీన్ రివర్స్ లో ఉంది. అయితే డేట్లు మాత్రం ఎవరూ చెప్పడం లేదు.