స్టార్ హీరోల పుట్టిన రోజులు, ఇంకేవైనా స్పెషల్ డేలకు పాత సినిమాలను రీ రిలీజ్ చేసుకుని అభిమానులు హంగామా చేయడం బాగానే ఉంది. ఈ సెలబ్రేషన్లు చూసి వారెవా అనుకుంటున్నారు. ఐతే ఆ సంబరాలు మరీ శ్రుతి మించి పోతుండడమే ఆందోళన కలిగిస్తోంది.
పోకిరి సినిమాకు కాకినాడలోని ఒక థియేటర్‌కు స్పెషల్ షో వేసిన సందర్భంగా విధ్వంసం జరిగి ఇకపై ఇలాంటి స్పెషల్ షోలు వేయకూడదని అక్కడి ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఆ తర్వాత జల్సా సినిమా విషయంలోనూ కొన్ని థియేటర్లలో ఇలాగే జరిగింది. థియేటర్లను దారుణంగా దెబ్బ తీశారు. విశాఖలోని ఒక థియేటర్‌లో సీట్లన్నీ ధ్వంసమయ్యాయి. స్క్రీన్ కూడా దెబ్బ తింది. ఆ థియేటర్ యజమాని ఈ విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆ అనుభవాలు చూశాక అయినా మిగతా హీరోల అభిమానులు మారుతారేమో అనుకుంటే అలాంటిదేమీ జరగట్లేదు. తాజాగా ప్రభాస్ అభిమానులు ఇలాగే హద్దులు దాటారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో బిల్లా మూవీ స్పెషల్ షో సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
థియేటర్ లోపల టపాకాయలు పేల్చే క్రమంలో థియేటర్‌కు నిప్పు పెట్టేశారు. సీట్లకు నిప్పంటుకుని భీతావహ పరిస్థితి నెలకొనడంతో అభిమానులు భయపడి పారిపోయారు. థియేటర్ సిబ్బంది వచ్చి మంటలార్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఒకవేళ మంటలు విస్తరించి థియేటర్ తగలబడిపోతే ఏంటి పరిస్థితి.
కోట్లల్లో నష్టం తప్పేది కాదు. ఇక ప్రాణనష్టం జరిగి ఉంటే దారుణంగా ఉండేది. ఇలాంటి ఉదంతాలు ఈ స్పెషల్ షోల విషయంలో అందరూ పునరాలోచనలో పడేలా చేస్తున్నాయి.