వర్షం అందుకే ఆగిపోయింది

Varsham

ఇంకో నాలుగు రోజుల్లో రాబోతున్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకపక్క బిల్లా 4K రీ రిలీజ్ హంగామా ఓ రేంజ్ లో పెరుగుతుండగా మరోవైపు సెట్స్ మీదున్న కొత్త సినిమాల అప్డేట్స్ ని సిద్ధం చేసే పనిలో ఆయా యూనిట్లు బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే వర్షం రీ రిలీజ్ కూడా గతంలోనే ప్లాన్ చేసుకున్నారు.

బిల్లాతో పాటు వర్షంని ఒకే రోజు స్క్రీనింగ్ చేసేలా డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమయ్యారు. కట్ చేస్తే ఇప్పుడీ డేట్లలో మార్పు వచ్చింది. వర్షంని 23కి బదులు 28న ప్రపంచవ్యాప్తంగా పునః విడుదలకు స్కెచ్ రెడీ అయిపోయింది. దీనికి కారణాలేంటనే సందేహం రావడం సహజం.

బాక్సాఫీస్ వద్ద థియేటర్ల లభ్యత చాలా టైట్ గా ఉంది. ఊహించని రేంజ్ లో కాంతార ఊచకోత కొనసాగడంతో రెండో వారంలోనూ దాని జోరు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ పై దాడి చేయబోతున్నాయి. ఓరి దేవుడా, సర్దార్, ప్రిన్స్, జిన్నాలు నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి.

మరోవైపు హాలీవుడ్ మూవీ బ్లాక్ ఆడమ్ కోసం మల్టీ ప్లెక్సుల టికెట్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. దాని షోలు ఎక్కువ వేసేందుకు యాజమాన్యాలు ఇష్టపడుతున్నాయి. వీటి మధ్యలో మళ్ళీ అదనంగా బిల్లాను వేసుకోవాలి.

ఇన్ని ఒత్తిళ్ల మధ్య వర్షంని తీసుకొస్తే ఇబ్బంది పడేది సదరు నిర్మాతలు డార్లింగ్ ఫ్యాన్సే. పైగా దీనికి సంబంధించి థియేటర్ ప్రదర్శనకు కావాల్సిన డిపిఎక్స్ ఫైల్ ని సెట్ చేయడం సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని, డిటిఎస్ సౌండ్ ని సింక్ చేసే క్రమంలోనూ చిక్కులు వచ్చాయని ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే వర్షంని వారం లేట్ గా వదులుతున్నారని డిస్ట్రిబ్యూటర్ టాక్.

అయినా ఈ ప్లానింగ్ ఏదో కరెక్ట్ గా చేసుకుని ఆ డిజాస్టర్ రెబెల్ బదులు మొన్న వర్షంని వేసుకుని ఉంటే జల్సా రేంజ్ లో రెస్పాన్స్ వచ్చి ఉండేదన్న అభిమానుల అభిప్రాయంలో వాస్తవం లేకపోలేదు.