ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్.. లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడమే. వీరి పెళ్లయి నాలుగు నెలలే కాగా.. ఇంతలోనే కవలలకు జన్మనిచ్చారు. నయన్ గర్భం దాల్చకుండానే సరోగసీ (అద్దె గర్భం) ద్వారా పిల్లల్ని కన్నారన్నది స్పష్టం. ఈ రోజుల్లో సెలబ్రెటీలు సరోగసీని ఆశ్రయించడం మామూలే కాబట్టి చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఐతే ఇండియాలో సరోగసీ చట్టాల ప్రకారం.. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఈ మార్గంలో పిల్లల్ని కనడానికి వీల్లేదు. దీనికి కొన్ని నిబంధనలున్నాయి.
సరోగసీలో పిల్లల్ని కనాలనుకున్న జంటలో భార్య వయసు 25-మధ్య ఉండాలి, భర్త వయసు 26-55 మధ్య ఉండాలి. అలాగే వీరికి పెళ్లయి ఐదు సంవత్సరాలు అయి ఉండాలి. ఐదేళ్లుగా సంతానం లేకపోయినా.. బిడ్డను కనడంలో ఆ ఇద్దరిలో ఎవరికైనా సమస్య ఉన్నా దాన్ని ధ్రువీకరిస్తూ వైద్య అధికారుల వద్ద అనుమతి పత్రం తీసుకుని ఆ తర్వాత సరోగసీని ఆశ్రయించాలి. ఐతే నయన్, విఘ్నేష్‌లకు పెళ్లయి నాలుగు నెలలే అయింది. వాళ్లు పిల్లల్ని కనడంలో ఇబ్బంది ఉన్నట్లుగా ఎలాంటి సర్టిఫికెట్ ప్రభుత్వానికి సమర్పించలేదని తెలుస్తోంది.
ఎందుకంటే స్వయంగా ఆ రాష్ట్ర సుబ్రమణియన్.. సరోగసీలో పిల్లల్ని కనడంపై నయన్, విఘ్నేష్‌లకు నోటీసులు ఇవ్వనున్నట్లు, వివరణ కోరనున్నట్లు, దీనిపై విచారణ కూడా జరపనున్నట్లు ప్రకటించారు. ఒక కార్యక్రమంలో మీడియా వారు ఈ విషయాన్ని ప్రస్తావించగా ఆయనిలా స్పందించారు. దీన్ని బట్టి నయన్, విఘ్నేష్ సరోగసీ నిబంధనలు పాటించారా అన్నది సందేహంగానే కనిపిస్తోంది. అంతిమంగా దీన్నుంచి ఎలాగోలా బయటపడొచ్చు కానీ.. పిల్లల్ని కని సంతోషంగా ఉండాల్సిన సమయంలో వారికి కొంత చికాకు తప్పేలా లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates