బాలయ్య నిర్మాతలపై ఫ్యాన్స్ ఒత్తిడి

నందమూరి బాలకృష్ణ దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ముందుగా చేసుకున్న ప్లానింగ్ ప్రకారం పక్కాగా జరిగిపోతోంది. దసరా పండక్కు టైటిల్ లాంచ్ చేద్దామనుకున్నారు కానీ ఈలోగా ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ ఈవెంట్ రావడంతో వాయిదా వేసుకోక తప్పలేదు. దీపావళికి ఖచ్చితంగా విడుదల తేదీతో పాటు ప్రకటన రావడం దాదాపు ఖాయమే. రిలీజ్ డేట్ ని డిసెంబర్ 23 క్రిస్మస్ సెలవులను టార్గెట్ గా పెట్టుకుని లాక్ చేద్దామనుకున్న సంగతి ఆల్రెడీ లీకవ్వడం అభిమానులకు గుర్తే. కానీ ఇప్పుడు వాళ్ళ నుంచే కొత్త ఒత్తిడి వస్తోంది.

ఈ NBK 107ని వచ్చే జనవరి సంక్రాంతికి వదలమని డిమాండ్ చేస్తున్నారు. బాలయ్య సినిమాలకు సహజంగా ప్లస్ అయ్యే పండగ సెంటిమెంట్ ని పూర్తిగా వాడుకునే పవర్ ఫుల్ కంటెంట్ ఇందులో ఉంది కాబట్టి కలెక్షన్ల కోణంలో అంతకన్నా బెస్ట్ సీజన్ మరొకటి ఉండదని అభిప్రాయపడుతున్నారు. కానీ ఇదే మైత్రి సంస్థ నిర్మిస్తున్న చిరంజీవి వాల్తేర్ వీరయ్యని ఆల్రెడీ అదే టైంకి ఫిక్స్ చేసి గతంలోనే అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు బాలకృష్ణ రావాలంటే మెగాస్టార్ తప్పుకోవాల్సి ఉంటుంది. అదంత సులభం కాదు. షూట్ ఆలస్యమైతే తప్ప ఇది జరగదు.

ఒకవేళ అలా అనుకున్నా మెగా ఫ్యాన్స్ ఊరుకోరు. కావాలనే చేశారని సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తారు. హరిహర వీరమల్లు / రామ్ చరణ్ 15 రావాల్సిన స్థానంలో వాల్తేర్ వీరయ్య వస్తోంది కాబట్టి సరే అనుకున్నారు. ఇప్పుడిదీ డ్రాప్ అయితే వాళ్లకు సమాధానం చెప్పడం కష్టమే. చిరు బాలయ్య సినిమాలు రెండు దాదాపు ఒకే స్టేజి చిత్రీకరణ దశలో ఉన్నాయి. సో ఈ సస్పెన్స్ తొలగాలంటే ఇంకో రెండు వారాలు వేచి చూడక తప్పదు. ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. ఏ కోణంలో చూసుకున్నా మెగా నందమూరి క్లాష్ మాత్రం సాధ్యం కాదు. డిసెంబర్ చివరి వారాన్ని బ్యాడ్ టైంగా గుర్తించకపోతే చాలు సమస్య పరిష్కారమైనట్టే