అమీర్ మాట తప్పడం నేర్చుకునే పాఠమే

అగ్ర హీరోలు ఏదైనా చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడం చాలా అవసరం. ఒకప్పుడంటే టెక్నాలజీ లేదు కాబట్టి ఆధారాలు ఉండేవి కాదు కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ సాంకేతికత వల్ల ప్రతిదీ వీడియో రికార్డుల్లో భద్రంగా ఉంటోంది. లాల్ సింగ్ చడ్డా విడుదలకు ముందు అమీర్ ఖాన్ తన సినిమా ఆరు నెలల తర్వాతే ఓటిటి స్ట్రీమింగ్ అవుతుందని కాబట్టి అందరూ థియేటర్లలో చూడాలని పిలుపునిచ్చాడు. సరే కంటెంట్ మీద నమ్మకంతో అలా చెప్పడం తప్పేం కాదు కానీ నొక్కి మరీ టైంని ప్రస్తావించడం కొంచెం ఓవరనే అనిపించింది. ఫ్లాప్ అయితే పునరాలోచిస్తామని చెప్పినా బాగుండేది.

తీరా చూస్తే ఇప్పుడు రెండు నెలలు తిరక్కుండానే కేవలం యాభై రోజులకే లాల్ సింగ్ చడ్డా నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. అది కూడా గుట్టు చప్పుడు కాకుండా ఎలాంటి పబ్లిసిటీ లేకుండా సైలెంట్ గా వదిలేశారు. సోషల్ మీడియాలో ట్విట్లు చూశాకే అభిమానులకు ఇది తెలిసింది. ట్రోలింగ్ కి తావివ్వకూడదనే ఇలా చేసిండొచ్చు కానీ అలా అని పూర్తిగా తప్పించుకోలేరుగా. నాగ చైతన్య స్పెషల్ క్యామియో చేయడం వల్ల తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మీద ఓ మోస్తరు ఆసక్తి ఉంది. కాకపోతే బొమ్మ మరీ దారుణంగా ఉందన్న నెగటివ్ టాక్ చూడకుండా ఆపేసింది కానీ ఇప్పుడో లుక్ వేయొచ్చు.

ఏది ఏమైనా అమీర్ మాట తిప్పడం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆ మధ్య టాలీవుడ్ నిర్మాతలు షూటింగుల స్ట్రైక్ సందర్భంగా ఇకపై ఓటిటి గ్యాప్ కనీసం ఎనిమిది వారాలు ఉండాలనే నిబంధనలను తీసుకొచ్చారు. ఫలితంతో సంబంధం లేకుండా అన్నింటికి వరిస్తుందని అన్నారు. కానీ డిజాస్టర్లకు ప్రత్యేక మినహాయింపులాంటివేమీ చెప్పలేదు. అంటే అందరికీ ఒకటే రూల్. మరోవైపు ఎర్లీ ప్రీమియర్లు జరుగుతూనే ఉన్నాయి. మూడో వారంలోనే ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వచ్చేసింది. అందరూ అగ్రిమెంట్ల సాకునే చూపిస్తున్నారు. చూస్తుంటే వచ్చే ఏడాది నుంచి తప్ప ఇది అమలయ్యే సూచనలు కనిపించడం లేదు