గెట్ రెడీ.. శివ 4కే వెర్ష‌న్


ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త‌గా రీ రిలీజ్ హంగామా న‌డుస్తోంది. పాత సినిమాల‌ను మ‌ళ్లీ రిలీజ్ చేసే సంప్ర‌దాయం గ‌తంలోనే ఉండేది కానీ.. 2000 త‌ర్వాత ఆ ఒర‌వ‌డి బాగా త‌గ్గిపోయింది. కొత్త సినిమాల థియేట్రిక‌ల్ రన్‌యే రెండు మూడు వారాల‌కు ప‌రిమితం అవుతున్న‌పుడు పాత సినిమాల‌ను రిలీజ్ చేసి సాధించేదేముంద‌ని ఆ సంప్ర‌దాయాన్ని ప‌క్క‌న పెట్టేశారు. కానీ ఈ మ‌ధ్య స్టార్ హీరోల కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ, ఫ్యాన్ మూమెంట్స్ బాగా ఉన్న సినిమాల‌ను మ‌ళ్లీ పెద్ద స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఆ షోల‌కు అద్భుత‌మైన స్పంద‌న కూడా వ‌స్తోంది.

పోకిరి, జ‌ల్సా, చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమాల‌కు వ‌చ్చిన రెస్పాన్స్ చూశాక మిగ‌తా హీరోల అభిమానుల్లోనూ ఎగ్జైట్మెంట్ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున త‌న కెరీర్‌లో గొప్ప మ‌లుపు, మైలురాయి అన‌ద‌గ్గ శివ చిత్రాన్ని రీరిలీజ్ చేయ‌డంపై క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

త‌న కొత్త చిత్రం ది ఘోస్ట్ రిలీజ్ నేప‌థ్యంలో మీడియాను క‌లిసిన నాగ్.. శివ చిత్రాన్ని డిజిట‌లైజ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపాడు. ఐతే ఈ సినిమా ప్రింట్లు కొన్ని మిస్స‌య్యాయ‌ని.. వాటి కోసం వెతుకుతున్నామ‌ని నాగ్ వెల్ల‌డించాడు. శివ అనే కాక పాత సినిమాలు చాలా వాటి ప్రింట్లు సంపాదించ‌డం క‌ష్ట‌మ‌వుతోంద‌ని నాగ్ చెప్పాడు. శివ ప్రింట్ల‌న్నీ సేక‌రించాక సినిమాను డిజిట‌లైజ్ చేయించి రీ రిలీజ్ చేయాల‌ని చూస్తున్నాం అని నాగ్ తెలిపాడు.

శివ రిలీజైన రోజునే ది ఘోస్ట్ కూడా విడుద‌ల‌వుతుండ‌టం చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పిన నాగ్.. శివ సినిమాలో టెక్నిక‌ల్ విషయాల‌పై అప్పుడెలా మాట్లాడుకున్నారో ఇప్పుడు ది ఘోస్ట్ గురించి కూడా అలాగే మాట్లాడుకుంటార‌న ఆశాభావం వ్య‌క్తం చేశాడు. చాలామంది త‌న గ‌త చిత్రం వైల్డ్ డాగ్‌తో ది ఘోస్ట్‌ను పోలుస్తుండ‌డంపై నాగ్ స్పందించాడు. ఇవి రెండూ పూర్తి భిన్న‌మైన చిత్రాలని, ఒక‌దానికి ఇంకోదానికి పోలిక ఉండ‌ద‌ని, సినిమా చూశాక అంద‌రికీ ఆ విష‌యం అర్థ‌మ‌వుతుంద‌ని అన్నాడు.