బిగ్ బాస్ షోపై మండిపడ్డ హైకోర్టు

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోపై సిపిఐ నారాయణ కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో అశ్లీలత పెరిగిపోయిందని, ఈ షో వల్ల ఎవరికీ ఉపయోగం లేదని చాలాకాలం నుంచి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇక, ఇటీవల బిగ్ బాస్ హౌస్ ఒక బూతుల స్వర్గమని, ఆ హౌస్ కు నాగార్జున బాస్ అని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపింది.

ఈ క్రమంలోనే నాగార్జునకు, నారాయణకు మధ్య పరోక్షంగా మాటలు యుద్ధం కూడా నడిచింది. అయితే, సీపీఐ నారాయణనే కాదు బిగ్ బాస్ షోలో అశ్లీలత పెరిగిపోతోందంటూ చాలామంది ప్రేక్షకులు కూడా పెదవి విరుస్తున్నారు. టీఆర్పీల కోసం షోలో కంటెస్టెంట్లతో డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.

ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు…ఘాటుగా స్పందించింది. ఆ షోలో అశ్లీలతపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 1970లలో ఎటువంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని కేంద్రం తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఈ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని, ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ గైడ్ లైన్స్ ను షో నిర్వాహకులు పాటించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

అయితే, ఈ వ్యవహారంపై స్పందించేందుకు కేంద్రం తరపు న్యాయవాది కొంత సమయం కావాలని కోరారు. దీంతో, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చే విషయాన్ని తదుపరి వాయిదాలలో నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 11కు కోర్టు వాయిదా వేసింది. దీంతో, బిగ్ బాస్ ను బ్యాన్ చేయబోతున్నారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య చర్చ మొదలైంది.