ఈ పాట దుమ్ముదుల‌ప‌నుందా?

ఆస్కార్ అవార్డుల పంట పండించుకున్న‌ స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ అనే సినిమా గుర్తుందా? దీన్ని గుర్తు తెచ్చేలా తెలుగులో ఇప్పుడు స్ల‌మ్ డాగ్ హ‌జ్బెండ్ అనే కొత్త సినిమా ఒక‌టి తెర‌కెక్కుతోంది. ఇందులో బ్ర‌హ్మాజీ త‌న‌యుడు, పిట్ట‌క‌థ ఫేమ్ సంజ‌య్ రావు హీరోగా న‌టిస్తున్నాడు. ప్ర‌ణ‌వి అనే కొత్త‌మ్మాయి క‌థానాయిక‌.

ఏఆర్ శ్రీధ‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి కొత్త‌గా ఒక పాట రిలీజ్ చేశారు. ల‌చ్చిగాని పెళ్లి అంటూ సాగే ఈ పాట‌ను మాస్ రాజా ర‌వితేజ విడుద‌ల చేయ‌డం విశేషం. ఈ పాట లాంచింగ్ సంద‌ర్భంగా బాగానే హ‌డావుడి జ‌రిగింది. ఐతే ఇలా హడావుడి చేసినంత మాత్రాన పాట జ‌నాల్లోకి వెళ్లిపోదు. పాట‌లో ద‌మ్ముండాలి. ఊపుండాలి.

ఆ ల‌క్ష‌ణాల‌న్నీ ఉన్న ల‌చ్చిగాని పెళ్లి త్వ‌ర‌లో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయితే ఆశ్చ‌ర్యమేమీ లేదు. బుల్లెట్ బండి త‌ర‌హాలో మంచి ఊపుతో సాగే ఈ పాట అచ్చ‌మైన హైద‌రాబాదీ మాస్ బీట్‌తో సాగుతూ ఒక ఊపేసేలా క‌నిపిస్తోంది. ఇలాంటి పాట‌ల‌కు పెట్టింది పేరైన కాస‌ర్ల శ్యామ్ క్యాచీ పదాల‌తో పాట రాయ‌గా.. సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్ సిసిరోలియో ఊపున్న ట్యూన్ చేశాడు.
స్వ‌యంగా పాట‌ను ఆల‌పించాడు. చాలా ఈజీగా జ‌నాల్లోకి వెళ్లిపోయి పెళ్ళిళ్ళలో, ఇత‌ర వేడుక‌ల్లో మార్మోగేలా క‌నిపిస్తోంది ఈ పాట‌. జీతు అనే డ్యాన్స్ మాస్ట‌ర్ ఈ పాట‌కు స్టెప్స్ కంపోజ్ చేయ‌డ‌మే కాక‌.. త‌నే స్వ‌యంగా పాట‌లో న‌ర్తించాడు. ఈ పాట వైర‌ల్ అయితే సినిమాకు ఆటోమేటిగ్గా బ‌జ్ క్రియేట్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.