ఆస్కార్‌కు పంపిన సినిమా రీమేకా?

ప్ర‌తి సంవ‌త్స‌రం ప్ర‌తిష్టాత్మ‌క‌ ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి ఒక సినిమాను నామినేట్ చేయ‌డం మామూలే. ఐతే ఆ ప్ర‌క్రియ పెద్దగా హ‌డావుడి లేకుండా జ‌రిగిపోతుంటుంది. చాలా వ‌ర‌కు జ‌నాల‌కు ట‌చ్ లేని ఆర్ట్ సినిమాల‌ను ఎంపిక చేసి ఆస్కార్ జ్యూరీకి పంపిస్తుంటారు. అవి క‌నీసం తుది జాబితా వ‌ర‌కు కూడా వెళ్ల‌లేక ఆరంభ ద‌శ‌లోనే తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతుంటాయి.

ఇదంతా మ‌న‌కు మామూలే అని స‌రిపెట్టుకుంటూ ఉంటారు జ‌నం. ఐతే ఈసారి మాత్రం ఆస్కార్ అవార్డుల ముంగిట మ‌న‌వాళ్ల‌లో ఎన్నో ఆశ‌లు రేగాయి. ఆర్ఆర్ఆర్ మూవీకి హాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్, క్రిటిక్స్‌తో పాటు నేటివ్ అమెరిక‌న్స్ నుంచి ఊహించ‌ని స్తాయిలో ప్ర‌శంస‌లు ద‌క్కిన నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని జ్యూరీ ప‌రిశీల‌న‌కు పంపితే క‌చ్చితంగా పురస్కారాలు ద‌క్కుతాయ‌ని ఆశించారు.

కానీ ఆర్ఆర్ఆర్‌ను ప‌క్క‌న పెట్టి చెల్లో షో అనే గుజ‌రాతీ మూవీని ఆస్కార్ అవార్డుల కోసం నామినేట్ చేసింది భార‌త ప్ర‌భుత్వం. ఎన్నో విష‌యాల్లో ద‌క్షిణాది మీద వివ‌క్ష చూపిస్తూ గుజ‌రాత్‌కు పెద్ద పీట వేస్తున్న మోడీ స‌ర్కారు.. చివ‌రికి సినిమా విష‌యంలోనూ అదే చేసిందంటూ తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఐతే చెల్లో షో గొప్ప సినిమా అయ్యే ఉంటుంద‌ని, లేదంటే ఆషామాషీగా అవార్డు కోసం పంప‌ర‌ని అనే వాళ్లు కూడా ఉన్నారు.

ఐతే చెల్లో షో ఎంత గొప్ప సినిమా అయిన‌ప్ప‌టికీ.. అది ఒరిజిన‌ల్ కాదు అనే చ‌ర్చ న‌డుస్తోంది. ఆ చిత్రం సినిమా పార‌డైసో అనే విదేశీ చిత్రానికి రీమేక్ అట‌. ఆ చిత్రానికి 1988లోనే ఆస్కార్ అవార్డు కూడా వ‌చ్చింద‌ట‌. ఈ రెండు చిత్రాల పోస్ట‌ర్లు చూస్తే అది వాస్త‌వ‌మే అనిపిస్తోంది. ఇది అఫీషియ‌ల్ రీమేక్ కూడా కాద‌ని.. కాపీ కొట్టి సినిమా తీశార‌ని.. ఈ విష‌యం అకాడ‌మీ వాళ్ల‌కు తెలియ‌కుండా పోద‌ని, అప్పుడు వాళ్లు ఛీకొట్టి సినిమాను వెన‌క్కి పంప‌డం గ్యారెంటీ అని అంటున్నారు.