తీసి ప‌డేశారు.. హిట్ల మీద హిట్లు

త‌మిళంలో వ్య‌క్తిగ‌తంగా చాలా బ్యాడ్ ఇమేజ్ ఉన్న హీరోల్లో శింబు ఒక‌డు. హీరోయిన్ల‌తో ప్రేమాయ‌ణాల విష‌యంలోనే కాక వేరే విష‌యాల్లోనూ అత‌డి మీద తీవ్ర ఆరోప‌ణ‌లున్నాయి. చాలా వివాదాల‌తో అత‌డి పేరు ముడిప‌డింది గ‌తంలో. ఒక ద‌శ‌లో శింబు మీద నిషేధం పడే ప‌రిస్థితులు కూడా క‌నిపించాయి. దీనికి తోడు వ‌రుస‌గా ప‌రాజ‌యాలు కూడా ప‌ల‌క‌రించ‌డంతో శింబు కెరీర్ తిరోగ‌మ‌నంలో ప‌య‌నించింది. అంద‌రూ అత‌ణ్ని లైట్ తీసుకోవ‌డం మొద‌లు పెట్టారు. అభిమానులు సైతం అత‌డి మీద ఆశ‌లు కోల్పోయిన ప‌రిస్థితి. దీనికి తోడు శింబు న‌టించిన కొన్ని సినిమాలు సుదీర్ఘ కాలం విడుద‌ల‌కు నోచుకోకుండా ఆగిపోయాయి. దీంతో అత‌ను ఇక పుంజుకోవ‌డం క‌ష్ట‌మ‌ని అంతా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. కానీ గ‌త రెండేళ్ల‌లో క‌థ పూర్తిగా మారిపోయింది.

గ‌త ఏడాది సంక్రాంతికి శింబు ఈశ్వ‌ర‌న్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా కోసం బ‌రువు త‌గ్గడంతో పాటు చాలా క‌ష్ట‌ప‌డ్డాడ‌త‌ను. తొలిసారి పూర్తిగా స్థాయి గ్రామీణ క‌థ‌లో అత‌ను న‌టించిన సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇక గ‌త ఏడాది నవంబ‌ర్లో రిలీజైన మానాడు అయితే పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అయి కూర్చుంది. వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం త‌మిళ‌నాడు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

త‌ర్వాత ఓటీటీలో కూడా ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా ఈ సినిమా ఆక‌ట్టుకుంది. శింబు ఇప్పుడు వెందు త‌నిందద కాదు అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అత‌డితో విన్నైతాండి వ‌రువాయ (తెలుగులో ఏమాయ చేసావె) లాంటి క్లాసిక్ తీసిన గౌత‌మ్ మీన‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ కాంబినేష‌న్ మీద ఉన్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చింది. త‌మిళ‌నాట ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యే దిశ‌గా అడుగులేస్తోంది. ప్యాక్డ్ హౌసెస్‌తో సినిమా న‌డుస్తోంది. 18 నెల‌ల వ్య‌వ‌ధిలో ఇలా మూడు ఘ‌న‌విజ‌యాలు ఖాతాలో వేసుకున్న శింబు పేరు ఇప్పుడు కోలీవుడ్లో మార్మోగుతోంది.