ప్రేక్ష‌కుల‌ను త‌ప్పుబ‌ట్ట‌ను-శ‌ర్వా

టాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు గ‌త కొన్నేళ్ల‌లో ఎన్ని ఎదురు దెబ్బ‌లు తిన్నాడో తెలిసిందే. మ‌హానుభావుడు త‌ర్వాత అత‌ను న‌టించిన అర‌డ‌జ‌ను సినిమాలు బోల్తా కొట్టాయి. ఇందులో ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు లాంటి నాట్ బ్యాడ్ అనిపించే సినిమాలు కూడా ఆడ‌లేదు. ఈ ప్ర‌భావం అత‌డి కొత్త చిత్రం ఒకే ఒకే జీవితం మీద కూడా ప‌డింది. ఈ సినిమాకు మంచి టాక్, రివ్యూలు వ‌చ్చినా అందుకు త‌గ్గ‌ట్లు వ‌సూళ్లు రాలేదు. ఓ మోస్త‌రు వ‌సూళ్ల‌తో స‌రిపెట్టుకుంటోందీ చిత్రం. ఇదే విష‌యం శ‌ర్వా ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తే.. తాను అందుకు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌మాత్రం నిందించ‌న‌ని అంటున్నాడు.

ఒక సినిమాకు ఎంత అర్హ‌త ఉందో అంతే వ‌సూలు చేస్తుంది. అంతే త‌ప్ప నా సినిమా ఇంత వ‌సూలు చేయాలి అని నేను లెక్క‌లు వేసుకోను. ఇంతే వ‌చ్చిందేంటి అని ప్రేక్ష‌కుల‌నో, మ‌రొక‌రినో నిందించ‌ను. నిజానికి ఒకే ఒక జీవితం లాంటి క‌థ‌, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇంత వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం, కొన్ని వారాల పాటు విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతుండ‌డం గొప్ప విష‌య‌మే అనుకుంటున్నా అని శ‌ర్వా అన్నాడు.

ఒకే ఒక జీవితం లాంటి సినిమాల్లో లాజిక్కులు వెతికి త‌ప్పుబ‌ట్ట‌డం ఈజీ అని.. అయినా ప్రేక్ష‌కులు, స‌మీక్ష‌కులు లోపాలు వెత‌క‌కుండా సినిమాను అప్రిషియేట్ చేశారంటే ఇదెంత మంచి సినిమానో అర్థం చేసుకోవ‌చ్చ‌ని, ఇలాంటి పాత్ర‌, సినిమా చేసే అవ‌కాశం అరుదుగా వ‌స్తాయ‌ని.. ఇది త‌న కెరీర్లో మ‌రిచిపోలేని అవ‌కాశ‌మ‌ని శ‌ర్వా చెప్పాడు. లిరిసిస్ట్ ట‌ర్న్డ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌చైతన్యతో చేస్తున్న చిత్రం రాజ‌కీయ నేప‌థ్యంలో ఉంటుంద‌ని.. కెరీర్లో ఇప్ప‌టిదాకా చేయ‌ని పాత్ర‌ను అందులో చేస్తున్నాన‌ని శ‌ర్వా తెలిపాడు. ప్ర‌స్తుతం తాను 14 కిలోల బ‌రువు త‌గ్గాన‌ని.. అది సినిమా కోసం కాకుండా త‌న కోసం తాను త‌గ్గింద‌ని శ‌ర్వా చెప్పాడు.