ప‌న్నెండేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌

టాలీవుడ్లో అభిమానులు అత్యంత ఆస‌క్తితో ఎదురు చూస్తున్న కాంబినేష‌న్ల‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు-మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ల‌ది ఒక‌ట‌న‌డంలో సందేహం లేదు. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి చిత్రం అత‌డు క‌మ‌ర్షియ‌ల్‌గా అనుకున్నంత స‌క్సెస్ కాలేదు.

రెండో చిత్రం ఖ‌లేజా అయితే డిజాస్ట‌ర్ అయింది. కానీ ఆ రెండు చిత్రాలూ త‌ర్వాతి కాలంలో క‌ల్ట్ స్టేట‌స్ అందుకున్నాయి. టీవీల్లో, ఓటీటీల్లో ఈ సినిమాల‌ను విర‌గ‌బ‌డి చూస్తుంటారు జ‌నం. అప్ప‌టి బాక్సాఫీస్ ప‌రిస్ఙితుల నేప‌థ్యంలో ఈ సినిమాలు స‌రిగా ఆడ‌లేదు కానీ.. అప్పుడు మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ జ‌త క‌డితే బ్లాక్‌బ‌స్ట‌ర్ రావ‌డం గ్యారెంటీ అనే న‌మ్మ‌కంతో ప్రేక్ష‌కులున్నారు. ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వీరి క‌ల‌యిక‌లో మూడో సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. గ‌త ఏడాది సినిమా అనౌన్స్ అయినా స‌రే.. మొద‌లు కావ‌డంలో ఆల‌స్యం జ‌రిగింది.

ఐతే ఖ‌లేజా త‌ర్వాత ప‌న్నెండేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ ఈ క‌ల‌ల చిత్రం ఎట్ట‌కేల‌కు సెట్స్ మీదికి వెళ్లింది. సోమ‌వార‌మే హైద‌రాబాద్‌లో ఎస్ఎస్ఎంబీ28కు శ్రీకారం చుట్టారు. ఒక భారీ సెట్లో యాక్ష‌న్ ఘ‌ట్టంతో ఈ సినిమా షూటింగ్ మొద‌లుపెట్టారు. ఈ షెడ్యూల్లో మేజ‌ర్ పార్ట్ యాక్ష‌న్ సీక్వెన్సేన‌ట‌. అది కాక కొన్ని స‌న్నివేశాలేవో తీస్తార‌ట‌. మ‌హేష్ పూర్తిగా ఈ షెడ్యూల్‌కు అందుబాటులో ఉండ‌నున్నాడు. రెండో షెడ్యూల్ నుంచి హీరోయిన్ పూజా హెగ్డే జాయిన్ అవుతుంది.

షూటింగ్ మొద‌లుపెట్ట‌డంలో కొంత ఆల‌స్యం జ‌రిగిన‌ప్ప‌టికీ.. రాబోయే ఐదారు నెల‌ల‌కు ప‌క్కాగా షెడ్యూల్స్ సిద్ధం అయిన‌ట్లు స‌మాచారం. ఈ మ‌ధ్య ప్ర‌క‌టించిన‌ట్లే వ‌చ్చే ఏడాది వేస‌వి కానుక‌గా, పోకిరి డేట్ అయిన ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త్రివిక్ర‌మ్ మాతృ సంస్థ అన‌ద‌గ్గ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.