మావయ్యల వాడకం అవసరమా?

స్టార్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచే వచ్చే యంగ్ హీరోలకు ఒక సౌకర్యం ఉంటుంది. మూల పురుషుడి రిఫరెన్సులు వాడేసుకుని ఎక్కువ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో తన సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా తాత బాబాయ్ ల పేర్లను వాడుకుని బాగానే రచ్చ చేసేవాడు.

మొదట్లో అది బాగానే అనిపించినా తర్వాత మానేశాడు. పవన్ కళ్యాణ్ ఖుషి, బంగారం లాంటి మూవీస్ లో మెగాస్టార్ పేరు ఫోటోని వాడుకోవడం అభిమానులకు గుర్తే. ఇలా చాలానే ఉన్నాయి. విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్ మూడో సినిమా రంగ రంగ వైభవంగా ప్రీ రిలీజ్ కు ముందు ఉన్న లో బజ్ కు తగ్గట్టే పూర్తి డివైడ్ టాక్ తో మెగా హీరోకు మరో ఫ్లాప్ ఇచ్చే దిశగా వెళ్తోంది.

కొండపొలం ఇచ్చిన షాక్ దీంతో రికవర్ అవుతుందనుకుంటే ఆ సూచనలు కనిపించడం లేదు. అయితే రంగ రంగలో పదే పదే హీరో పాత్రతో చిరంజీవి పాత పాటలు హమ్మింగ్ చేయించడం, సిచువేషన్ కి సింక్ లేకుండా హీరోయిన్ ఎదురుగా అభిలాషలోని నవ్వింది మల్లెచెండు సాంగ్ కు డాన్స్ చేయడం, ఇవన్నీ మినిమమ్ కిక్ ఇవ్వని మాట వాస్తవం.

అంతే కాదు వైష్ణవ్ కేతికలు వీడియో కోచ్ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు అత్తారింటికి దారేదిలో పవన్ సమంతాల పాటొకటి చూపించడం పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఆకట్టుకోవడం కోసమే. ఇవన్నీ తప్పని కాదు కానీ స్వంత టాలెంట్ తో ఋజువు చేసుకుంటే తప్ప నిలదొక్కుకోలేని ఇండస్ట్రీలో నేను ఫలానా బ్యాక్ గ్రౌండ్ కి చెందినవాడినని చెప్పుకునేలా ఇలాంటి ఇరికించిన సీన్లు అవసరమాని ఆలోచించుకుంటే బెటర్. ఉప్పెనలో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన వైష్ణవ్ కి ఆ తర్వాత యాక్టింగ్ కి అంత పేరు రావడం లేదెందుకో. ఇది కాస్త విశ్లేషించుకుంటే మంచిది.