అనుదీప్ కేవీ.. జాతిరత్నాలు సినిమాతో ఈ పేరు మార్మోగిపోయింది. పిట్టగోడ అనే ఎవరికీ పట్టని చిన్న సినిమాతో దర్శకుడగా పరిచయం అయిన ఈ కుర్రాడు.. జాతిరత్నాలుతో థియేటర్లను నవ్వుల్లో ముంచెత్తాడు. ఆ చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంట పండించాడు. చిన్న సినిమాతో భారీ విజయం సాధించడంతో అతడికి క్రేజీ ఆఫర్లు వచ్చాయి.
ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్‌తో పెద్ద బడ్జెట్లో తెలుగు-తమిళ భాషల్లో ప్రిన్స్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈలోపు అనుదీప్ కథ అందించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మీడియాను కలిసిన అతను.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాడు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే తాను సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో జట్టు కట్టే అవకాశమున్నట్లు అతను సంకేతాలు ఇచ్చాడు.
వెంకటేష్‌కు త్వరలోనే తాను ఒక కామెడీ కథను నరేట్ చేయబోతున్నట్లు అనుదీప్ వెల్లడించాడు. తమ కలయికలో సినిమా వచ్చేందుకు ఆస్కారముందని చెప్పాడు. దీనికి తోడు తనకు పెద్ద లైనప్పే ఉన్నట్లు అనుదీప్ వెల్లడించాడు. వాటి వివరాలు తర్వాత చెబుతానన్నాడు. నిజానికి ఫస్ట్ డే ఫస్ట్ షో కథను కూడా తానే డైరెక్ట్ చేయాల్సిందని అనుదీప్ చెప్పాడు.
కానీ తనకు ఖాళీ లేకపోవడం వల్ల, తన అసిస్టెంట్లయిన వంశీ, లక్ష్మీనారాయణలకు ఈ కథ నచ్చి, ఓన్ చేసుకోవడంతో వారికి ఈ కథను తెరకెక్కించే బాధ్యత అప్పగించినట్లు తెలిపాడు. తన జీవిత అనుభవాల నేపథ్యంలోనే ఫస్ట్ డే ఫస్ట్ షో కథ రాశానని.. తాను నిజంగానే పవన్ కళ్యాణ్ అభిమానిని అని.. ఖుషి సినిమాకు తొలి రోజు టికెట్లు సంపాదించడం కష్టమైందని.. పవన్ ప్రతి సినిమానూ తాను తొలి రోజే చూడటానికి కష్టపడేవాడినని అనుదీప్ తెలిపాడు. రెండు రోజుల వ్యవధిలో నడిచే ఈ కథ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని అనుదీప్ ధీమా వ్యక్తం చేశాడు.