ఆ దర్శకుడు.. ఎప్పుడూ ఇంతే

శక్తి సౌందర్ రాజన్ అని ఒక తమిళ దర్శకుడు. అతడి సినిమాలన్నీ అదో టైపుగా ఉంటాయి. మిగతా ఇండియన్ దర్శకుల్లా అతను ఆలోచించడు. ఎప్పుడూ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల చుట్టూనే అతడి ఆలోచనలు తిరుగుతుంటాయి. ఇలాంటి సినిమాలు మనం ఎందుకు తీయకూడదు అన్నట్లుగా అలాంటి కథలే ప్రయత్నిస్తుంటాడు. ఇండియాలో ఎవ్వరూ ప్రయత్నించని జాంబీ జానర్లో సినిమా తీసి చాలా ఏళ్ల కిందటే అతను అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. జయం రవి హీరోగా నటించిన ఆ చిత్రం అంతా ఆకట్టుకోలేదు.

ఆ తర్వాత అదే హీరోతో ‘టిక్ టిక్ టిక్’ అనే సినిమా తీశాడు. ఈసారి అతడి కథ అంతరిక్షం చుట్టూ తిరిగింది. హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు ఎంత పాపులరో తెలిసిందే. తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా ‘అంతరిక్షం’ సినిమా రావడానికంటే ముందే ఇండియాలో తెరకెక్కిన తొలి ఫుల్ లెంగ్త్ స్పేస్ మూవీగా ఇది రికార్డులకెక్కింది. ఆ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. 

ఆ తర్వాత శక్తి సౌందర్ రాజన్ ‘టెడ్డీ’ అనే సినిమా తీశాడు. అది హాట్ స్టార్ ద్వారా రిలీజై మంచి స్పందనే తెచ్చుకుంది. మనిషిలా ప్రవర్తించే ఒక టెడ్డీ బేర్ చుట్టూ తిరిగే సైన్స్ ఫిక్షన్ మూవీ అది. అందులో ఆర్య హీరో. ఇప్పుడు ఇదే హీరోతో ఇంకో హాలీవుడ్ టచ్ ఉన్న సినిమా చేశాడు శక్తి సౌందర్ రాజన్. అదే.. కెప్టెన్. ఈ చిత్రం బహు భాషల్లో తెరకెక్కింది. ఇది హాలీవుడ్ మూవీ ‘ప్రిడేటర్’ను తలపించే సినిమాలా కనిపిస్తోంది. ఇందులో హీరో ఒక ఆర్మీ కెప్టెన్. సాహసాలు చేసే అతడికి ఒక పెద్ద సవాలు ఎదురవుతుంది.

ఒక అడవిలో తిరుగుతున్న వింత జీవి అక్కడికి వెళ్లిన వాళ్లందరినీ మట్టు పెడుతుంటే దాని సంగతి తేల్చాల్సిన అవసరం పడుతుంది. అదొక ఏలియన్ లాగా ఉంటుంది. దాన్ని హీరో అతడి టీం ఎలా ఎదుర్కొంటుందన్నదే ఈ కథ. ఈ సినిమా కథాంశం, విజువల్స్; ఎఫెక్ట్స్ అన్నీ కూడా హాలీవుడ్ రేంజినే తలపిస్తున్నాయి. కాకపోతే ఇలాంటివి హాలీవుడ్లో చాలా చూశాం కాబట్టి మన ప్రేక్షకులు ఎంత కొత్తగా ఫీలవుతారన్నది ప్రశ్నార్థకం. సెప్టెంబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.