పుష్ప‌-2.. ఒక కీల‌క మార్పు

మొత్తానికి మోస్ట్ అవైటెడ్ సీక్వెల్  పుష్ప‌-2 సినిమాకు సంబంధించి ఎట్ట‌కేల‌కు ఒక క‌ద‌లిక వ‌చ్చింది. సోమ‌వార‌మే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌డం వ‌ల్ల హీరో అల్లు అర్జున్ ఈ వేడుక‌లో పాల్గొన‌లేదు. హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా, మిగ‌తా న‌టీన‌టులు కూడా ఎవ‌రూ దీనికి హాజ‌రు కాలేదు. చాలా సింపుల్‌గా ద‌ర్శ‌కుడు సుకుమార్, ఆయ‌న టీం స‌భ్యులు, నిర్మాత‌లు క‌లిసి పూజా కార్య‌క్ర‌మం పూర్తి చేశారు.

త‌ర్వాత స‌రైన ముహూర్తాలు లేక‌పోవ‌డంతో హీరో లేకుండానే సింపుల్‌గా ఇలా ముహూర్త వేడుక పూర్తి చేశారు. పూజా కార్య‌క్ర‌మంలో సంద‌ర్భంగా పుష్ప‌-2కు సంబంధించి ఒక కీల‌క మార్పు గురించి స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చింది. పుష్ప‌-1లో నిర్మాణ భాగ‌స్వామిగా ఉన్న ముత్తంశెట్టి మీడియా సంస్థ.. సీక్వెల్‌కు దూర‌మైంది. దాని స్థానంలోకి సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ వ‌చ్చింది.

అల్లు అర్జున్ అమ్మ త‌ర‌ఫు బంధువుల‌దే ముత్తంశెట్టి మీడియా సంస్థ‌. వారికి బ‌న్నీ త‌ర‌ఫున ఒక అవ‌కాశం ఇవ్వ‌డం కోసం పుష్ప‌లో భాగ‌స్వామిని చేశారు. బ‌న్నీ కాల్ షీట్లు ఈ సంస్థ‌తోనే ఉన్న‌ట్లుగా చెప్పించి ఆ మేర‌కు కొంత వాటా ఇప్పించారు. లాభాల్లో ఆ వాటాకు త‌గ్గ‌ట్లుగా లాభాల్లో కొంత షేర్ ఇచ్చారు. అంత‌టితో ఆ సంస్థ క‌థ ముగిసింది.

పుష్ప భారీ విజ‌యం సాధించ‌డం, సీక్వెల్ మీద అంచ‌నాలు భారీగా పెరిగిపోవ‌డంతో ద‌ర్శ‌కుడు సుకుమార్ దీనికి ఆదాయంలో ఎక్కువ వాటా తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ముందు నుంచి మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో తాను చేసే సినిమాల్లో పారితోష‌కంతో పాటు కొంత మేర లాభాల్లో వాటా తీసుకుంటున్నారు సుకుమార్. ఐతే పుష్ప‌-2 రేంజే వేరు కావ‌డం, ఫ‌స్ట్ పార్ట్ క‌న్నా రెండు మూడు రెట్లు వ‌సూళ్లు రాబ‌డుతుంద‌న్న అంచ‌నా ఉండ‌డంతో సుకుమార్ ఇందులో నిర్మాణ భాగ‌స్వామిగానూ చేరిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో ఆయ‌న రాజ‌మౌళికి ద‌గ్గ‌రగా ఆదాయం అందుకునే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు.