మహేష్ రికార్డు సేఫ్

రికార్డుల విషయంలో మహేష్ బాబు అభిమానులకు ఎవరూ సాటిరారన్నది వాస్తవం. ఎంత పెద్ద స్టార్ కైనా అసలు వంద రోజులు కాదు కదా కనీసం అర్ధ శతదినోత్సవమే కలగా మారిపోయిన పరిస్థితుల్లో తమ హీరోకు మాత్రం చెక్కుచెదరని జ్ఞాపకాలను శాశ్వతంగా మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సర్కారు వారి పాటను నేరుగా నాలుగు ఆటలతో వైజాగ్ లోని గోపాలపట్నం మౌర్య థియేటర్ లో హండ్రెడ్ డేస్ ఆడించారు. ఆగస్ట్ 19తో ఆ అరుదైన ఫీట్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా వేడుకలు, అన్నదానాలు తదితరాలు చేస్తున్నారు.

ఇందులో విశేషం ఏముందనుకోవద్దు. సర్కారు వారి పాట మూడు వారాలకే పే పర్ వ్యూ పద్ధతిలో ప్రైమ్ లో వచ్చింది. ఆ తర్వాత మరో ఇరవై రోజులకు ఫ్రీ స్ట్రీమింగ్ ఇచ్చారు. ఎనభై కోట్లకు పైగా షేర్ వచ్చింది కానీ పూర్తి ప్రాఫిటబుల్ వెంచర్ గా మిగల్లేదు. అందుకే ఫిఫ్టీ డేస్ ఆడటమనేది చిన్న విషయం కాదు. అసలు అందరూ మర్చిపోయిన మూవీ ఇలాంటి మైలురాయి అందుకోవడం విశేషమేగా. అసలైన ట్విస్టు మరొకటి ఉంది. మహేష్ సోలో హీరోగా ఇప్పటిదాకా నటించిన 27 సినిమాలు కనీసం ఏదో ఒక సెంటర్ లో ఇలా శతదినోత్సవం చేసుకున్న ఘనతను అందించారు.

వీటిలో బాబీ, నాని,నిజం లాంటి డిజాస్టర్లు సైతం ఈ మార్కు అందుకున్న దాఖలాలు ఉన్నాయి. ఒక్కడు, పోకిరి, శ్రీమంతుడులు ఆడటంలో ఆశ్చర్యం లేదు కానీ ఎవరికీ అందని ఓ రికార్డు కోసం ఇలా చేయడం మాత్రం విశేషమే. అది కూడా ఇప్పటి టెక్నాలజీ కాలంలో ఒక్క థియేటరైనా సరే నాలుగు ఆటలతో సర్కారు వారి పాటతో దీన్ని కొనసాగించడం అభిమానులకే చెల్లింది. ఫ్యాన్స్ తలుచుకుంటే ఎంతసేపూ. ఎలాగూ 28, 29 సినిమాలు త్రివిక్రమ్, రాజమౌళిలవి కాబట్టి కంటెంట్ విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఈజీగా ఈ మార్కును అందుకుంటాయి.