‘తెలుగు’ రుణం తీర్చుకున్న కేజీఎఫ్ డైరెక్టర్

‘కేజీఎఫ్‘ అనే ఒకే ఒక్క సినిమాతో దేశంలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు ప్రశాంత్ నీల్. ఐతే అతను పేరుకు కన్నడిగుడే కానీ.. తన మూలాలు తెలుగు గడ్డ మీదే ఉన్నాయి. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి తమ్ముడైన సుభాష్ రెడ్డి కొడుకే ఈ ప్రశాంత్ నీల్. అతడి కుటుంబంలో చాలా ఏళ్ల కిందటే బెంగళూరుకు వెళ్లి సెటిలైపోయింది. ప్రశాంత్ అక్కడే పెరగడంతో కన్నడిగుడు అయిపోయాడు.

కానీ అతడికి అనంతపురం జిల్లా శింగనమల ప్రాంతంతో మంచి సంబంధాలే ఉన్నాయి. అతడికి తెలుగు కూడా బాగా వచ్చు. అప్పుడప్పుడూ అతను శింగనమలకు వచ్చి వెళ్తుంటాడు కూడా. తాజాగా ప్రశాంత్ తన తండ్రి సొంత ఊరికి విచ్చేశాడు. అక్కడ తన పెదనాన్న రఘువీరారెడ్డి తోడ్పాటుతో ఏర్పాటవుతున్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని సందర్శించాడు. దీనికి పెద్ద మొత్తంలో విరాళం కూడా ప్రకటించాడు. ఆ మొత్తం రూ.50 లక్షలు కావడం విశేషం.

ఇప్పుడు ప్రశాంత్ స్థాయికి రూ.50 లక్షలు చిన్న మొత్తమే కావచ్చు. కానీ తన మూలాలు మరిచిపోకుండా తన తండ్రి సొంత ఊరిలో ఆయన పేరు మీద రూ.50 లక్షల విరాళం ఇవ్వడం గొప్ప విషయమే. ఇప్పటిదాకా ప్రశాంత్‌ తన కుటుంబ సభ్యుడే అనే విషయం బహిరంగంగా చెప్పుకుని రఘువీరారెడ్డి డప్పు కొట్టుకున్నది లేదు. ఐతే ఈ విరాళం ప్రకటించడంతో ప్రశాంత్‌ను కొనియాడుతూ, అతను తన సోదరుడి కొడుకే అన్న విషయం వెల్లడిస్తూ ట్వీట్ వేశారు రఘువీరారెడ్డి.

ఇక శింగనమలను సందర్శించిన సందర్భంగా.. మీడియా వాళ్లు ప్రశాంత్‌ను సినిమా ప్రశ్నలు కూడా కొన్ని అడిగారు. ఎన్టీఆర్‌తో చేయబోతున్న సినిమా గురించి చెప్పండి అంటే.. ‘‘ఏం చెప్పాలి. ఆ సినిమా కథ చెప్పాలా’’ అంటూ ప్రశాంత్ చమత్కరించాడు. ఈ చిత్రం 2023 ఏప్రిల్ కల్లా మొదలు కావచ్చని ప్రశాంత్ సంకేతాలు ఇచ్చాడు. ప్రస్తుతం అతను ప్రభాస్‌తో ‘సలార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం 2023 సెప్టెంబరు 28న రిలీజవుతుందని సోమవారమే ప్రకటించడం తెలిసిందే.