ఒక్కోసారి అంతే ఎంత పెద్ద సీనియరైనా కెరీర్ స్లో అవుతోందే అనుకున్నప్పుడు ఉన్నట్టుండి ఒక బ్లాక్ బస్టర్ వచ్చేసి ఇన్నింగ్స్ మళ్ళీ వేగమందుకుంటుంది. కొందరికి ఎన్ని హిట్లు వచ్చినా ఆశించిన స్థాయిలో ఆఫర్లు ఉండవు. ఇండస్ట్రీ పోకడ చిత్రవిచిత్రంగా ఉంటుంది. రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నా ఒకప్పటి రేంజ్ లో వేషాలు కానీ గుర్తింపు కానీ తగ్గిపోయిన కమెడియన్ శ్రీనివాసరెడ్డికి కేవలం ఒక నెల గ్యాప్ లో రెండు పెద్ద సక్సెస్ లు దక్కడం అందులోనూ తనవి కథను మలుపు కీలక పాత్రలు కావడంతో మంచి గుర్తింపు వస్తోంది.
గత వారం విడుదలైన బింబిసారలో జపాన్ స్టయిల్ మీసాలతో శ్రీనివాసరెడ్డి పోషించిన జుబేదా పాత్ర తనకు పెద్ద మైలేజ్ తెచ్చింది. సినిమా మొత్తం కనిపించకపోయినా చక్రవర్తి ఫ్లాష్ బ్యాక్ తో పాటు క్లైమాక్స్ లో అతనికి ఇచ్చిన క్యారెక్టర్ స్క్రీన్ మీద బాగా పండింది. అందుకే ప్రమోషన్లలో కళ్యాణ్ రామ్ తో పాటు చాలా యాక్టివ్ గా పాల్గొన్నాడు. కట్ చేస్తే ఇవాళ కార్తికేయ 2లో నిఖిల్ మావయ్యగా చేసిన పాత్ర అంతే పేరు తెచ్చేలా ఉంది. అరగంట తర్వాత ఎంట్రీ ఇచ్చినా చివరి ఫ్రేమ్ వరకు హీరోతో పాటే ఉండే కృష్ణుడి భక్తుడిగా తన టైమింగ్ తో నిలబెట్టేశాడు
ఎప్పుడో 2001లో ఇండస్ట్రీకి వచ్చిన శ్రీనివాసరెడ్డి స్పీడ్ ఈ మధ్య బాగా తగ్గింది. ఈ ఏడాది అతను కనిపించిన వాటిలో భళా తందనాన, టెన్త్ క్లాస్ డైరీస్ డిజాస్టర్లు కాగా ఎఫ్3 ఒకటే హిట్టు కొట్టింది. అందులో ఆర్టిస్టులు ఎక్కువ ఉండటంతో అంతగా హైలైట్ కాలేకపోయాడు. ఇప్పుడీ బింబిసార, కార్తికేయ 2ల పుణ్యమాని తిరిగి రేస్ లోకొచ్చాడు. ఈ రెండూ ఫాంటసీ జానర్ లో రూపొందిన చిత్రాలు కావడం గమనార్హం. వీటి దర్శకులు వశిష్ట, చందూ మొండేటిలతో కలిసి శ్రీనివాసరెడ్డి ప్రసాద్ ఐమ్యాక్స్ ప్రీమియర్లో గట్టిగానే సందడి చేశారు.