పోకిరిని కొట్టేలా.. జల్సా టార్గెట్

మహేష్ అభిమానులు ఇప్పుడు టాలీవుడ్లో అందరు స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను కవ్వించి వదిలి పెట్టేశారు. మొన్న మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని పోకిరి స్పెషల్ షోలతో వాళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. హీరోల పుట్టిన రోజులప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా కలిపి పదో ఇరవయ్యో స్పెషల్ షోలు వేసుకోవడం మామూలే కానీ.. మహేష్ అభిమానులు మాత్రం ఏకంగా 375 షోల దాకా ప్లాన్ చేశారు. అవన్నీ కూడా దాదాపుగా హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యాయి.

తెలుగు రాష్ట్రాల అవతల బెంగళూరు, చెన్నైలతో పాటు యుఎస్‌లో సైతం ఈ షోలు వేయడం.. అభిమానులు వెర్రెత్తిపోవడం గమనార్హం. ఈ షోల ద్వారా  వరల్డ్ వైడ్ 1.72 కోట్ల గ్రాస్ రావడం కూడా ఒక రికార్డు. షోలు, కలెక్షన్ల విషయంలో ఈ రికార్డులను ఇంకెవరూ కొట్టగలరా అంటూ మహేష్ అభిమానులు సవాలు  విసురుతుండడం గమనార్హం. ఈ సవాలును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు స్వీకరించినట్లే కనిపిస్తోంది.

సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘జల్సా’ సినిమా స్పెషల్ షోల కోసం కొన్ని రోజులుగా ప్లానింగ్ జరుగుతోంది. చాలా కష్టపడి 4కే ఫార్మాట్లోకి సినిమాను మార్చారు. ఇందుకోసం ఒక టీం కొన్ని రోజులుగా పని చేస్తోంది. సౌండ్, విజువల్ క్వాలిటీ చాలా బాగా వచ్చిందని, ప్రింట్ అదిరిపోయిందని గీతా ఆర్ట్స్ వర్గాలు అంటున్నాయి. ఈ అప్‌డేట్ బయటికి రాగానే పవన్ అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు.

అభిమాన సంఘాల నాయకులతో పాటు మెగా ఫ్యామిలీ పీఆర్వోలు కూడా రంగంలోకి దిగి షోల ప్లానింగ్‌లో పడిపోయారు. ‘పోకిరి’ రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా వీళ్ల ప్లానింగ్ నడుస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో, బయట పవన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ‘పోకిరి’ లక్ష్యంగా ఏకంగా 500 షోలకు ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ షోలన్నీ అనుకున్నట్లుగా పడ్డాయంటే, అభిమానులు కూడా బాగా స్పందించారంటే ‘పోకిరి’ కలెక్షన్ల రికార్డు కూడా ఆటోమేటిగ్గా బద్దలైపోవడం ఖాయం.