ఆమిర్ మిస్సయిన బిగ్ లాజిక్స్

బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన ఆమిర్ ఖాన్.. తన కెరీర్లో ఎన్నడూ ఎరుగని ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటున్నాడు ‘లాల్ సింగ్ చడ్డా’తో ఈ చిత్రం విడుదలై రెండు రోజులే అయింది. కానీ దాని ఫలితమేంటో తొలి రోజు మార్నింగ్ షోతోనే తేలిపోయింది. నిజానికి ఈ సినిమా ఫలితమేంటో విడుదలకు ముందే దాదాపుగా నిర్ణయం అయిపోయిందని చెప్పాలి. ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేదు. దీనికి తోడు రకరకాల కారణాల వల్ల ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు సోషల్ మీడియాలో.

ఆ ప్రభావం సినిమా మీద గట్టిగానే పడిందన్నది స్పష్టం. ఇక హాలీవుడ్లో క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న ‘ఫారెస్ట్ గంప్’ను రీమేక్ చేయడంలో ఎక్కడ తేడా జరిగిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేటివిటీ పరంగా మార్పులు చేసి కథ, పాత్రల విషయంలో ఒరిజినల్‌ను ఫాలో అయినా కూడా ఇక్కడ సోల్ అండ్ ఫీల్ పూర్తిగా మిస్సయ్యాయి. ఒరిజినల్లో టామ్ హాంక్స్‌తో పోలిస్తే కొంచెం భిన్నంగా చేయాలని ఆమిర్.. తన పాత్ర విషయంలో అతి చేయడం మైనస్ అయింది. ఒరిజినల్లో హీరో కొంచెం లో ఐక్యూ ఉన్నవాడిలా కనిపిస్తాడు తప్ప.. మరీ జోకర్ లాగా ప్రవర్తించడు.

ఆమిర్ ఆ పాత్రలో అలా హద్దులు దాటి నటించడం మైనస్ అయింది. ఇంత తేడాగా ఉన్న వ్యక్తి ఆర్మీలో చేరడం, యుద్ధంలో పాల్గొనడం ఏంటి అనే లాజికల్ ప్రశ్నలు తలెత్తి సదరు సన్నివేశాలన్నీ అసహజంగా అనిపించాయి. నిజానికి ఒరిజినల్లో చూపించింది రియాలిటీనే. వియత్నాంతో యుద్ధంలో పాల్గొనేందుకు అప్పుడు అమెరికా లో ఐక్యూ ఉన్న వాళ్లను కూడా ఆర్మీలోకి తీసుకుంది. ఆ నేపథ్యంలోనే అక్కడ హీరో పాత్రను అల్లారు. కానీ ఇక్కడ ఇండియాలో ఆ పరిస్థితి కనిపించదు. ఎంతో కఠినంగా సాగే ఆర్మీ ట్రయల్స్‌లో పిచ్చివాడిలా కనిపించే హీరో సెలక్టవడం, యుద్ధంలో పాల్గొనడం విడ్డూరంగా అనిపిస్తుంది.

ఇక్కడ లాజిక్ పూర్తిగా మిస్ అయిపోయింది. ఇక ఒరిజినల్లో హీరో తన కమాండర్‌ను కాపాడగా.. తాను వీరమరణం పొందకుండా, అవిటివాడిలా జీవించడానికి కారణమయ్యాడని హీరో మీద ద్వేషం పెంచుకుంటాడు. ‘లాల్ సింగ్ చడ్డా’లో ఈ పాత్రను కమాండర్‌గా కాకుండా ఉగ్రవాదిగా మార్చారు. ఉగ్రవాద నాయకుడిని హీరో కాపాడడం.. మన సైన్యం మీద ఎటాక్ చేసిన అతణ్ని ప్రభుత్వం ఉరితీయకుండా వదిలిపెట్టడం.. అతను పరివర్తన చెంది హీరో బిజినెస్ పార్ట్‌నర్ కావడం.. ఇదంతా కృత్రిమంగా, అసహజంగా, ఇంకా చెప్పాలంటే ప్రేక్షకులకు ఒళ్లు మండేలా చేస్తుంది. అసలే సినిమా మీద గట్టిగా నెగెటివ్ ప్రచారం జరుగుతుండగా.. ఈ క్యారెక్టర్ దానికి మరింత ఆజ్యం పోసినట్లయింది.