గంటల్లో రిలీజు – టన్నుల్లో టెన్షన్

ఇంకొద్ది గంటల్లో అమీర్ ఖాన్ కొత్త సినిమా లాల్ సింగ్ చడ్డా థియేటర్లలో అడుగు పెట్టనుంది. నాగ చైతన్య ఓ కీలక పాత్ర చేయడంతో తెలుగు ప్రేక్షకులకూ అంతో ఇంతో దీని మీద ఆసక్తి నెలకొంది. చిరంజీవి సమర్పించారు కాబట్టి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందనే నమ్మకంతో టీమ్ ఉంది. అయితే ముందు నుంచి విపరీతంగా భయపెట్టిన బాయ్ కాట్ టెన్షన్ మాత్రం ఎంతకీ తగ్గడం లేదు. ఇప్పటికీ ఎందరో నెటిజెన్లు గతంలో అమీర్ చేసిన యాంటీ ఇండియన్ కామెంట్లకు నిరసనగా ఈ సినిమాను చూడమని తేల్చి చెబుతున్నారు.

కళను వ్యక్తిగత అభిప్రాయాలను ముడిపెట్టి చూడొద్దని ఎందరు చెబుతున్నా వాటి తాలూకు ప్రభావం నుంచి తప్పించుకోవడం మాత్రం కష్టంగా ఉంది. గతంలో తానన్న వ్యాఖ్యలకు అమీర్ ఇప్పుడు ప్రాయశ్చిత్తం వ్యక్తం చేస్తున్నా అదేదో ముందే చేసుండాలని, రిలీజ్ ముంగిట్లో పెట్టుకుని ఇలాంటి సారీలు చెప్పడం పబ్లిసిటీ గిమ్మిక్కేనని మరికొందరి అభిప్రాయం. నిన్న అమీర్ తమిళనాడు వెళ్లి అజిత్ విజయ్ రజనీకాంత్ లను మీడియా ముఖంగా ఆ హీరోలు ఎదురుగా లేకపోయినా ఆకాశానికి ఎత్తడం మరో ట్రోలింగ్ కి ఛాన్స్ ఇచ్చింది

ఏది ఏమైనా లాల్ సింగ్ కి కఠిన పరీక్షే స్వాగతం చెబుతోంది. దానికి తగ్గట్టు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఏమంత జోరుగా లేవు. పబ్లిక్ ముందు టాక్ తో పాటు రివ్యూస్ చదివాకే వెళ్లాలా వద్దాని నిర్ణయించుకునే మూడ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. సూర్యవంశీ టైంలో కనిపించిన బాక్సాఫీస్ దూకుడులో లాల్ సింగ్, రక్షాబంధన్ లు కనీసం సగం కూడా కనబరచడం లేదని ట్రేడ్ విశ్లేషణ. చైతుకి ఇది తొలి హిందీ డెబ్యూ కాబట్టి ఫలితం పట్ల తను కూడా నెర్వస్ గా ఉన్నాడు. తన పెర్ఫార్మన్స్ మీద ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందోననే ఉద్వేగం సహజమే