నిఖిల్ డైరెక్షన్ చేయడానికి రెడీ అయి..

సినీ రంగంలో హీరోలకు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ.. ఒక సినిమాకు సంబంధించి అత్యున్నత స్థాయిలో నిలిచేది దర్శకుడే. ఒక సినిమా బాగా ఆడినా, ఆడకపోయినా అందుకు బాధ్యత వహించాల్సింది దర్శకుడే. అందుకే దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. వాళ్లకు ఉండే గౌరవం వేరు. అందుకే సినీ రంగంలో ఎవరు ఏ పని చేసినా.. ఒకసారి డైరెక్షన్ చేస్తే బాగుండు అనుకుంటారు. సినీ రంగంలో వేరే క్రాఫ్ట్‌ల్లో పని చేసి ఏదో ఒక దశలో దర్శకత్వం చేసిన వాళ్లు చాలామందే కనిపిస్తారు.

నటీనటుల్లో కూడా దర్శకత్వం చేసిన వాళ్లు లేకపోలేదు. చేయాలనే కోరిక ఉండి ఇంకా ఆ దారిలోకి వెళ్లని వాళ్లూ ఉన్నారు. తన సినిమాలకు సంబంధించి కథల ఎంపికలో, మేకింగ్‌లో కీలకంగా వ్యవహరించే యువ కథానాయకుడు నిఖిల్‌కు సైతం దర్శకత్వ అభిరుచి ఉందట. అతను ఇప్పటికే దర్శకుడు కావాల్సిందట. కానీ కొందరు శ్రేయోభిలాషులు తనను వెనక్కి లాగినట్లు ఓ ఇంటర్వ్యూలో అతను వెల్లడించాడు.

‘‘ఒక చిన్న పిల్లల సినిమా డైరెక్ట్ చేద్దామని అనుకున్నాను. అది నా కల. దానికి అన్నీ సిద్ధం చేసి సినిమా మొదలుపెడదాం అనుకునే సమయానికి నాకు తెలిసిన దర్శకులు, నిర్మాతలు వద్దని చెప్పారు. ఉన్న సమయాన్ని హీరోగా సద్వినియోగం చేసుకోమని సలహా ఇచ్చారు. అందుకే ప్రస్తుతానికి ఆ చిత్రాన్ని పక్కన పెట్టా. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తా’’ అని నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు.

ఇక తన కెరీర్ గురించి నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘నేను లాక్ డౌన్ సమయంలో నాలుగు సినిమాల్లో నటించాను. 18 పేజెస్, కార్తికేయ-2, స్పై, సుధీర్ వర్మతో ఒక సినిమా. వీటిలో కార్తికేయ-2 మొదట రిలీజవుతోంది. తర్వాత 18 పేజెస్ వస్తుంది. ఆపై స్పై, కార్తికేయ-2 విడుదల అవుతాయి. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. గీతా ఆర్ట్స్ బేనర్లో ఒక సినిమా ఓకే అయింది. దాంతో పాటుగా కొన్ని సినిమాలను ‘కార్తికేయ-2’ విడుదల తర్వాత అనౌన్స్ చేద్దామనుకుంటున్నాను’’ అని చెప్పాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ-2’ ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.