చిరు పుట్టినరోజు.. మొత్తం రిపేర్

ఇంకో రెండు వారాల్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు రానుంది. అభిమానులు సంబరాలకు రెడీ అవుతున్నారు. ఇలా వేడుకలు చేసుకోవడం హీరోకి ఫ్యాన్స్ కి ఇద్దరికీ కొత్తేమీ కాదు కానీ ఈ ఏడాది మాత్రం వీలైనంత డ్యామేజ్ రిపేర్ కు వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఆచార్య దారుణ డిజాస్టర్ ఎన్ని కోట్ల నష్టం మిగిల్చిందో వ్యక్తిగతంగా చిరుకున్న శిఖరమంత ఇమేజ్ ని ఇప్పటి నూనూగు మీసాల కుర్రాళ్ళలో అంతే స్థాయిలో తగ్గించేసింది.

రెండో రోజే హౌస్ ఫుల్ కాలేనంత బ్యాడ్ గా కలెక్షన్లు పడిపోవడం చిరుకు ఎప్పుడూ జరగలేదు. దానికి తోడు బింబిసార హిట్టయ్యాక ఒక వర్గం యాంటీ ఫ్యాన్స్ కళ్యాణ్ రామ్ స్థాయి మెగాస్టార్ ని దాటిపోయిందనేలా అర్థం లేని ట్విట్టర్ క్యాంపైన్ ఒకటి చేయడం అనవసరమైన చిచ్చు రేపింది. అసలు బింబిసార ఇంటర్వ్యూలలో కళ్యాణ్ రామే ప్రత్యేకంగా జగదేకేవీరుడు అతిలోకసుందరి, మగధీర ప్రస్తావన తీసుకొచ్చాడు.

సక్సెస్ ను అభినందిస్తూ చిరు చేసిన ట్వీట్ కు గౌరవప్రదంగా సర్ అంటూ సంభోదిస్తూ బదులిచ్చాడు. ఇదంతా హీరోల మధ్య ఇండస్ట్రీలో ఎంత సుహుద్భవ వాతావరణం ఉందో చెప్పేందుకే ఉపయోగపడింది. ఇది కాసేపు పక్కనపెడితే చిరు మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. అసలే రెండు రీమేకులు గాడ్ ఫాదర్, భోళా శంకర్ ల మీద అభిమానులు బోలెడు టెన్షన్ తో ఉన్నారు.

వాల్తేర్ వీరయ్య ఒక్కటే స్ట్రెయిట్ మూవీ. అందులోనూ రవితేజ సపోర్ట్ తప్పలేదు. ఈ నేపథ్యంలో బర్త్ డేకు ఘనమైన కానుకలను టీజర్లు, పోస్టర్ల రూపంలో ఇచ్చేందుకు ఆయా యూనిట్లు సిద్ధమయ్యాయని తెలిసింది. యంగ్ జెనరేషన్ హీరోలు ఎంత దూసుకుపోతున్నా మెగా స్వాగ్ ఎప్పటికీ తగ్గదని నిరూపించేలా చాలా ప్రమోషనల్ మెటీరియల్ సిద్ధం చేశారని సమాచారం. అందుకే ఒక స్పెషల్ ఫోటో షూట్ కూడా చేశారు. ఇవి కనక క్లిక్ అయితే ఆచార్య గాయాలు మాసిపోవడం ఎంత సేపు. కాకపోతే అసలు సినిమాలు వాటికి ధీటుగా ఉండాలి