టాలీవుడ్ లో బిజీ అయ్యే బ్యూటీ?

టాలీవుడ్‌ను కొంత కాలంగా హీరోయిన్ల కొరత వేధిస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన రొమాన్స్ చేయడానికి సరైన హీరోయిన్లు ఎక్కువ మంది లేరు. త్రిష, నయనతార, అనుష్క, తమన్నా, కాజల్, సమంత, రకుల్ ప్రీత్ లాంటి వాళ్ల జోరు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్లతో స్టార్ హీరోలు పెద్దగా సినిమాలు చేయట్లేదు. వీరి తర్వాత వచ్చిన స్టార్ హీరోయిన్లలో ఎక్కువమంది చూపు పూజా హెగ్డే, రష్మిక మందన్నల మీదే ఉంది. ప్రధానంగా వీళ్లతోనే స్టార్ హీరోలు మళ్లీ మళ్లీ సినిమాలు తీయాల్సి వస్తోంది.

ఈ క్రమంలో డిమాండ్ బాగా పెరగిపోయి వీళ్ల డేట్ల కోసం హీరోలు ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అలా అని ఆషామాషీ హీరోయిన్లను తీసుకుని రిస్క్ చేయడానికి సిద్ధపడట్లేదు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలకు సరైన కొత్త హీరోయిన్లు ఎవరు దొరుకుతారా అని చూస్తున్న సమయంలో మృణాల్ ఠాకూర్ రూపంలో మంచి ఆప్షన్ కనిపించినట్లుంది టాలీవుడ్ జనాలకు.

‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది మృణాల్. ఈ సినిమాలో ఆమె ఎంత అందంగా కనిపించిందో మాటల్లో చెప్పడం కష్టం. మంచి అభిరుచి, భావుకత ఉన్న హను రాఘవపూడి లాంటి దర్శకుడి చేతిలో పడడంతో ఆమె దశ తిరిగినట్లే కనిపిస్తోంది. మామూలుగానే హీరోయిన్లను చాలా అందంగా చూపిస్తాడని హనుకు పేరుంది. అతడి అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రాలతో పరిచయం అయిన లావణ్య త్రిపాఠి, మెహ్రీన్ కౌర్ ఆ తర్వాత ఎంత బిజీ అయ్యారో తెలిసిందే. వీరిలా మృణాల్ కొత్తమ్మాయి ఏమీ కాదు. హిందీలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేసింది.

కానీ తెలుగు వారికి ఆమె కొత్త కథానాయిక లాగే పరిచయం అయింది. ‘సీతారామం’లో మృణాల్ అందం, అలాగే అభినయం చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. కొన్ని సన్నివేశాల్లో కళ్లతో ఆమె పలికించిన భావాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ మృణాల్‌ను మరిన్ని సినిమాల్లో చూడాలన్న కోరిక పుట్టే ఉంటుంది. ఇండస్ట్రీ జనాలు కూడా ఆమె మీద కచ్చితంగా దృష్టి పెడతారనడంలో సందేహం లేదు. మున్ముందు పెద్ద హీరోల సినిమాల్లో ఆమె కథానాయికగా అవకాశం అందుకుంటే ఆశ్చర్యం లేదు.