విజయేంద్ర ప్రసాద్ అంటే.. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. తన కొడుకు రాజమౌళి దర్శకత్వంలో ఆయన కథలతో తెరకెక్కిన మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘనవిజయం సాధించాయో తెలిసిందే. ఇంకా కొడుకు కోసం ఆయన అందించిన వేరే కథలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ‘బాహుబలి’తో వచ్చిన పేరుతో ఆయన బాలీవుడ్లో భజరంగి భాయిజాన్, మణికర్ణిక లాంటి భారీ సినిమాలకు కథ అందించగా అవి కూడా మంచి ఫలితాన్నందుకున్నాయి.
దీంతో ఆయనకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. హిందీలో ఆయన మరికొన్ని భారీ చిత్రాల కోసం పని చేస్తున్నట్లు ఇంతకుముందు సంకేతాలు ఇచ్చాడు. వాటి సంగతి ఇంకా ఏమీ తేలకుండానే ఇప్పుడు ఆయన రచనతో ఒక భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఐతే ఇది రాజమౌళి తీసే సినిమా కాదు. ఒక బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్.. ఒక తెలుగు దర్శకుడితోనే ఈ చిత్రం తెరకెక్కిస్తుందని అంటున్నారు.
ఐతే ఆ సినిమా కథ గురించి అయితే సమాచారం బయటికి వచ్చింది. ‘1770-ఏక్ సంగ్రామ్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుందట. బెంగాలీలో వచ్చిన ‘ఆనంద మఠం’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట. బ్రిటిష్ పాలనలో 1770 లో జరిగిన ఒక సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంలో ఈ నవల ఉంటుంది. 1771వ సంవత్సరంలో బెంగాల్‌లో సంభవించిన మహా కరువు, సన్యాసుల తిరుగుబాటు.. తదితర అంశాల ప్రస్తావన ఇందులో ఉంటుంది.
ప్రఖ్యాత బెంగాలీ రచయిత బకించంద్ర చటర్జీ ఈ నవలను రాశారు. బెంగాలీ నుంచి ఇది హిందీ సహా పలు భాషల్లోకి అనువాదం అయింది. ఈ నవలలో ఉపయోగించిన ‘వందేమాతరం’ గీతాన్నే 1896 కాంగ్రెస్ మహాసభల సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారట. తర్వాతే వందేమాతర గీతం ప్రసిద్ధికెక్కింది. చరిత్ర మీద ప్రస్తుత రచయితల్లో విజయేంద్రకు ఉన్నంత పట్టు ఇంకెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇలాంటి భారీ చిత్రానికి ఆయన అందిస్తే దానికి వచ్చే క్రేజ్ వేరుగా ఉంటుంది. ఆగస్టు 15న ఈ సినిమా గురించి ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates