ఈ మధ్య బాలీవుడ్లో చాలా సినిమాలకు బాయ్‌కాట్ జాఢ్యం పట్టుకుంది. సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు బాలీవుడ్ పెద్ద హీరోల సినిమాలను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమిర్ ఖాన్ కూడా ఇలాగే టార్గెట్ అవుతున్నాడు. ఆయన కొత్త చిత్రం లాల్ సింగ్ చడ్డాను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆమిర్ స్పందించి తనకు దేశమంటే ఇష్టమని, తన సినిమాను బహిష్కరించవద్దని, అందరూ చూడాలని పిలుపునిచ్చాడు కూడా. కాగా ఆమిర్‌ను టార్గెట్ చేస్తూ భాజపా నేత, మాజీ నటి విజయశాంతి సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్టు పెట్టారు.
ఈ సందర్భంగా ఆమె పరోక్షంగా ఆమిర్‌ను సపోర్ట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి చురకలంటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే… ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ గారికి జనం అర్థమయ్యేలా చేస్తున్నరు. బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ 2015లో ఆమీర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడాయన చూస్తున్నారు. భారత్‌లో అసహనం పెరిగిపోయిందని… ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో ఆమీర్ అన్నారు.
ప్రజలు ఆమీర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టడంతో పాటు, ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వాణిజ్య ఉత్పత్తుల్ని కూడా బహిష్కరించారు. గతంలో ఆమీర్ నటించిన పీకే సినిమాలో సైతం హిందూ వ్యతిరేకతనే ప్రధానంగా చూపించడమే గాక, హిందూ దేవుళ్లని అవమానించారు. ప్రజల్లో ఏమాత్రం స్ఫూర్తిని నింపే స్థితిలో లేని ఆమీర్… గతంలో చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యల్ని ప్రజలు ఆయనకి గుర్తు చేస్తూ Boycott Laal Singh Chaddha హ్యాష్ ట్యాగ్‌తో ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నరు.
దురదృష్టమేంటంటే జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు ఆమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీషోల్లో పాల్గొంటున్నరు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదేమో వారు ఆలోచించాలి అని తన పోస్టులో విజయశాంతి పేర్కొంది.లాల్ సింగ్ చడ్డాకు తెలుగులో సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లలో సైతం చిరు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు నాగార్జున సైతం తోడయ్యారు. తమిళంలో ఈ చిత్రాన్ని కమల్ ప్రమోట్ చేశారు. వీళ్లందరికీ విజయశాంతి కౌంటర్ వేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates