మళ్లీ ‘డబుల్ ధమాకా’ చూడబోతున్నామా?

ప్రతి వారాంతం ఒకటికి మించే కొత్త సినిమాలు రిలీజవుతుంటాయి. కొన్నిసార్లు అరడజను, పది సినిమాలు రిలీజైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వాటిలో ఒక్కటి కూడా ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడుతుంటాయి.జూన్ తొలి వారం తర్వాత తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు.

చివరగా టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది జూన్ తొలి వారంలో. ఆ వీకెండ్లో మేజర్, విక్రమ్ సినిమాలు రిలీజై.. రెండూ చాలా మంచి టాక్ తెచ్చుకున్నాయి. అవి వీకెండ్లోనే కాక ఆ తర్వాత కూడా నిలకడగా వసూళ్లు సాధించాయి. జూన్ నెల మొత్తం ఈ రెండు సినిమాలదే ఆధిపత్యం అయింది. తర్వాత వచ్చిన కొత్త సినిమాలేవీ వీటి ముందు నిలవలేకపోయాయి. జులై నెలలో కూడా డిజాస్టర్ స్ట్రీక్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ స్ట్రీక్‌కు ఎప్పుడు బ్రేక్ పడుతుందా అని ట్రేడ్ ఎదురు చూస్తోంది. ప్రస్తుత వారాంతంలోనూ నిరాశ తప్పలేదు.

ఐతే వచ్చే వారం రాబోతున్న రెండు చిత్రాల మీద ట్రేడ్ చాలా ఆశలే పెట్టుకుంది. మళ్లీ మేజర్, విక్రమ్ సినిమాల తరహాలో డబుల్ ధమాకా చూడబోతున్నామనే ఆశలు రేకెత్తిస్తున్నాయి ఆ రెండు చిత్రాలు. అవే.. బింబిసార, సీతారామం. ఈ చిత్రాలకు సంబంధించి ఇప్పటిదాకా నెగెటివిటీ అనేదే లేదు. వీటి నుంచి రిలీజ్ చేసిన ప్రతి ప్రోమో ఆకట్టుకుంది. బింబిసార ఫాంటసీ టచ్ ఉన్న యాక్షన్ మూవీ కాగా.. ‘సీతారామం’ కొంచెం థ్రిల్‌తో ముడిపడ్డ ప్రేమకథ. ‘బింబిసార’ నుంచి రిలీజ్ చేసిన తొలి ట్రైలర్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఒక కొత్త దర్శకుడు, కళ్యాణ్ రామ్ లాంటి ఫ్లాప్ హీరో కలిసి ఇలాంటి భారీ చిత్రాన్ని రాజీ పడకుండా తీయడం, ప్రేక్షకుల్లో ఈ సినిమా తప్ప చూడాలన్న ఆసక్తి రేకెత్తించడం విశేషమే. రెండో ట్రైలర్, ప్రి రిలీజ్ ఈవెంట్లో తారక్ మాటలు సినిమా మీద అంచనాలను ఇంకా పెంచాయి.

ఇక ‘సీతారామం’ విషయానికి వస్తే.. దీన్నుంచి రిలీజ్ చేసిన పాటల తాలూకు వీడియోలో ముగ్ధమనోహరంగా అనిపించాయి. పాటలు వినడానికి కూడా చాలా బాగున్నాయి. టీజర్, ట్రైలర్ కూడా వావ్ అనిపించాయి. ఇది కూడా తప్పక చూడాలనిపించే సినిమాలాగే కనిపిస్తోంది. రెండింట్లోనూ స్యూర్ షాట్ హిట్ అనే కళ కనిపిస్తోంది. మరి అంచనాలకు తగ్గట్లే ఈ సినిమాలు ఉండి ప్రేక్షకులకు మళ్లీ ‘డబుల్ ధమాకా’ వినోదాన్ని అందిస్తాయేమో చూడాలి.