సాఫ్టు సినిమాకు ఘాటు ప్రమోషన్లు

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీతా రామం ప్రమోషన్లు మాములుగా లేవు. ఏకంగా చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకుని మరీ నాలుగు రాష్ట్రాలు తిరుగుతున్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లతో పాటు మన సుమంత్ కూడా ప్రతి చోటికి వెళ్లి పబ్లిసిటీలో భాగమవుతున్నారు. నిజానికిది మాస్ సినిమా కాదు. యుద్ధ నేపథ్యంలో సాగే లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా. అది కూడా వర్తమానానికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ ఉండదు. దశాబ్దాల క్రితం కథను ఇప్పటి జెనెరేషన్ కు పొయెటిక్ గా చూపించబోతున్నారు

ట్రైలర్ చాలా బాగుందనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. థియేటర్లకు జనం పెద్దగా కదలని పరిస్థితుల్లో ఇలాంటి సాఫ్ట్ మూవీస్ ఏ మేరకు వర్కౌట్ ఆవుతాయనే అనుమానం లేకపోలేదు. అందుకే సీత రామం టీమ్ ఈ స్థాయిలో తిరిగేస్తోంది.

ఒకపక్క అదే రోజు కళ్యాణ్ రామ్ బింబిసార ఉన్న నేపథ్యంలో దాన్ని ధీటుగా ఎదురుకునేందుకు ప్లాన్ చేసుకుంటోంది. రెండు జానర్లు పూర్తిగా సంబంధం లేనివే అయినప్పటికీ ప్రేక్షకులు రెండు వస్తే ఏదో ఒక సినిమానే చూసేందుకు ఇష్టపడుతున్న ట్రెండ్ లో ఓపెనింగ్స్ తెచ్చుకోవడం కీలకంగా మారింది.

వైజయంతి బ్యానర్ కావడంతో బిజినెస్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. పైగా ప్రభాస్ ప్రాజెక్ట్ కె వీళ్లదే కాబట్టి దాన్ని భవిష్యత్ కోణంలో చూస్తూ రేట్ల గురించి ఆలోచించకుండా బయ్యర్లు ముందుకు వస్తున్నారు. దుల్కర్, రష్మిక మందన్న, సుమంత్ ఇలా క్యాస్టింగ్ పరంగా ఆకర్షణలు చాలా ఉన్నాయి కనక ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు హిట్టు కొట్టేయొచ్చు. మహానటి, కనులు కనులు దోచాయంటే నుంచి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న దుల్కర్ కు సీతా రామం మీద చాలా ఆశలున్నాయి.