వీరమల్లుకు మళ్ళీ బ్రేక్ పడింది

ఒకపక్క జనసేన కార్యకలాపాలతో బిజీగా ఉంటూ కావాల్సినంత టైం సినిమాలకు ఇవ్వలేకపోతున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే బయటకి కనిపించని చాలా ఒత్తిడిని ఎదురుకుంటున్నారు. ఒక వైపు పవర్ స్టార్ కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న హరిహర వీరమల్లు నత్తనడకన సాగుతుంటే మరోవైపు స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్న భవదీయుడు భగత్ సింగ్ ఎప్పుడు మొదలవుతుందో అర్థం కాని కన్ఫ్యూజన్ లో దర్శకుడు హరీష్ శంకర్ తో పాటు అభిమానులున్నారు. ఇవి చాలవన్నట్టు వినోదయ సితం రీమేక్ కు సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.

నిన్న పిలుపునిచ్చిన షూటింగుల బందు పవన్ కు మరోరకంగా కలిసి వచ్చేలా ఉంది. ఎందుకంటే హరిహర వీరమల్లుని ఆగస్ట్ రెండో వారం నుంచి రీ స్టార్ట్ చేస్తారనే వార్త వచ్చిన కొద్దిగంటల్లోనే ఈ బందు వ్యవహారం తెరపైకొచ్చింది. సో కొనసాగించడానికి లేదు. మళ్ళీ పవన్ తన రాజకీయ యాత్రలు జనవాణిలు కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే ఈ అడ్వాంటేజ్ ఎన్ని రోజులు ఉంటుందన్నది ఎవరికీ తెలియని భేతాళ ప్రశ్న. వచ్చే ఏడాది పూర్తిగా ఎన్నికల ప్రచారం కోసం ప్లాన్ చేసుకోవాల్సిన పవన్ కు ఇప్పుడు సమయం చాలా విలువైనది.

ఫైనల్ గా భగత్ సింగ్ ఉంటుందో లేదో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ లెక్కన చూస్తే హరిహర వీరమల్లు 2023 సంక్రాంతి రావడం అసాధ్యంగానే తోస్తోంది. ఇది ముందే తెలిసి చిరంజీవి వాల్తేర్ వీరయ్యను పండగ బరిలో దింపినట్టు అర్థమవుతోంది. ఎందుకంటే అన్నదమ్ములు బాక్సాఫీస్ వద్ద తలపడే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒకవేళ పవన్ సహకరించి వేగంగా పూర్తి చేసినా వేసవిని టార్గెట్ చేయడం తప్ప మరో మార్గం ఉండదు. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ టైం అవసరం పడుతుంది.