టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. ఒకప్పుడు తెలుగులో నందమూరి తారకరామారావు మాస్ సినిమాలతో నంబర్ వన్ హీరోగా ఉంటే.. తనకు నప్పే క్లాస్ చిత్రాలతోనే భారీ విజయాలందుకుంటూ ఆయనకు దీటుగా నిలిచేవారు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన వారసుడు అక్కినేని నాగార్జున సైతం టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకడిగా కొనసాగాడు. కానీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి తర్వాతి తరం స్టార్ల జోరుతో మిగతా సీనియర్ హీరోల మాదిరే నాగ్ హవా కూడా తగ్గింది.
గత కొన్నేళ్లలో అయితే నాగ్ పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. మాస్ ఫాలోయింగ్ పూర్తిగా పడిపోయింది. అభిమానులు కూడా ఆయనకు అంతగా అండగా నిలుస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. ఓపెనింగ్స్ పరంగా నాగ్ పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. ఆఫీసర్ అనే సినిమా కోటి రూపాయల షేర్ కూడా సాధించలేని పరిస్థితి. కానీ మంచి టాక్, రివ్యూలు తెచ్చుకున్న వైల్డ్ డాగ్ మూవీ కూడా ఐదు కోట్ల షేర్ కూడా సాధించలేదంటే నాగ్ మార్కెట్ ఎంతగా దెబ్బ తిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ తరం యూత్, మాస్ నాగ్‌ను లైట్ తీసుకుంటున్నారన్నది స్పష్టం. నాగ్ కొడుకుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. నాగచైతన్య మాస్ ఫాలోయింగ్ అంతంతమాత్రం. లవ్ స్టోరీలతోనే విజయాలందుతున్నాయి. ఐతే మజిలీ, లవ్ స్టోరి లాంటి చిత్రాలకు హీరోయిన్లు పెద్ద బలంగా నిలవగా.. ఇప్పుడు థాంక్యూ సినిమాకు ఆ సపోర్ట్ కొరవడింది. చైతూ ఇమేజ్‌ను, అతడి బాక్సాఫీస్ స్టామినాను ప్రశ్నార్థకం చేసేలా మరీ కనీస స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి ఈ చిత్రానికి.
ఇప్పుడు బాక్సాఫీస్ పరిస్థితులు బాగా లేకపోవచ్చు. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చి ఉండొచ్చు. వర్షాల ప్రభావం కూడా ఉండొచ్చు. కానీ వీకెండ్లో ఐదు కోట్ల షేర్ కూడా వచ్చే పరిస్థితి లేదంటే మాస్‌లో చైతూ ఎంత వీకో అర్థమవుతుంది. మరోవైపు అఖిల్ పరిస్థితి కూడా ఇప్పటిదాకా అయితే గొప్పగా లేదు. మరి ఏజెంట్‌తో అయినా అతను మాస్ ఇమేజ్ సంపాదించి అక్కినేని బలాన్ని చూపిస్తాడేమో చూడాలి.